
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం ,కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఐదు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ జరిగిన నియోజకవర్గాలలో తమిళనాడులోని మదురాంతకం , ధారపురం, పుదుచ్చేరిలోని తట్టన్‌చావడి, పశ్చిమ బెంగాల్‌లోని రేజినగర్ , నందిగ్రామ్, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానం ఉన్నాయి.శుక్రవారం (అక్టోబర్ 9) అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 79 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని అవాంఛనీయ సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎలక్షన్ అధికారులు తెలిపారు. పూర్వ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో 79.39 శాతం పోలింగ్ నమోదు కాగా, ముర్షిదాబాద్‌లోని రేజినగర్‌లో సాయంత్రం 5 గంటల వరకు 78.42 శాతం ఓటింగ్ నమోదైంది.
మరోవైపు తమిళనాడులోని మదురాంతకంలో 78.86 శాతం, పుదుచ్చేరిలోని తట్టంచవాడిలో 78.83 శాతం ఓటింగ్ నమోదైంది. ధారపురంలో 78.53 శాతం ఓటింగ్ నమోదు కాగా అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానంలో 76 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సువేందు అధికారికి పరీక్ష
పశ్చిమ బెంగాల్ కు బీజేపీ తొలి సీఎం అయిన సువేందు అధికారి నందిగ్రామ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్ పైనే ఉంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అధికారి తన కంచుకోట అయిన నందిగ్రామ్‌ను నిలబెట్టుకుంటూనే, భవానిపూర్‌లో మమతా బెనర్జీని ఓడించారు. ఆ తర్వాత భవానిపూర్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకోవడంతో, నందిగ్రామ్ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక అనివార్యమైంది. సువేందు అధికారి పీఎ కుమార్తె హసిరానీ రథ్ ను బీజేపీ బరిలోకి దింపింది.
విజయ్‌కు తొలి ఎన్నికల పరీక్ష
మధురాంతకం, ధరాపురం ఉప ఎన్నికలు తమిళనాడు సీఎం విజయ్ కి తొలి ఎన్నికల పరీక్షగా నిలవనున్నాయి. ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీకి, సీఎం సి. జోసెఫ్ విజయ్ తొలిసారి బైపోల్స్ ఎదురుకుంటున్నారు. మధురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్ , ధరాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఆ తర్వాత TVKలో చేరి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే మధురాంతకం నియోజకవర్గం నుంచి27 మంది అభ్యర్థులు, ధరాపురం నుంచి30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.