
Smriti Mandhana: హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె స్థానాన్ని స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
గత వారంలో ముగిసిన ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. 2012 నుంచి భారత మహిళల జట్టుకు నాయకత్వం వహించిన హర్మన్‌ప్రీత్.. తన సుదీర్ఘ కెప్టెన్సీ అధ్యాయానికి ముగింపు పలికారు. దీంతో తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇందుకు సంబంధించి స్మృతి మంధాన పేరే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా హర్మన్‌ప్రీత్‌కు డిప్యూటీగా వ్యవహరించిన మంధాన.. రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేని సందర్భాల్లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. దీంతో జట్టు పరిస్థితులు, నాయకత్వ వ్యవస్థపై ఆమెకు ఇప్పటికే మంచి అవగాహన ఉంది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. జింబాబ్వేతో జరగనున్న స్వదేశీ వైట్‌బాల్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే తదుపరి సెలెక్టర్ల సమావేశంలో మంధానను కొత్త కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నెలలో భారత్, జింబాబ్వే మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. రాయ్‌పూర్, వడోదర వేదికలుగా ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మంధానకు కెప్టెన్సీలోనూ మంచి రికార్డు ఉంది. 2024-25 మధ్య ఆమె నాలుగు వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా.. ఆ నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. అంటే వన్డే కెప్టెన్‌గా ఆమె విజయ శాతం 100%గా ఉంది.
టీ20 అంతర్జాతీయాల్లోనూ మంధాన పలుమార్లు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. హర్మన్‌ప్రీత్ అందుబాటులో లేని సమయంలో 18 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ఆమె.. పూర్తయిన 17 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 6 ఓటములు నమోదు చేశారు. దీంతో టీ20ల్లో ఆమె విజయ శాతం 61.11గా ఉంది. మరోవైపు భారత మహిళల జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంధాన చుట్టూ జట్టును నిర్మించాలని బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తదుపరి ప్రపంచకప్‌తో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతున్న మంధానకు అంతర్జాతీయ అనుభవం, స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు నాయకత్వ అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ తర్వాత భారత మహిళల జట్టు పగ్గాలు స్మృతి మంధాన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.