
సముద్రం ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని అడుగున జరిగే ఒక్క భారీ భూకంపం పరిస్థితిని క్షణాల్లో మార్చేయగలదు. సముద్రపు అడుగుభాగం ఒక్కసారిగా పైకి లేదా కిందికి కదిలితే, దాని పైన ఉన్న భారీ నీటి స్తంభం కూడా స్థానభ్రంశం చెందుతుంది. ఆ శక్తి సముద్రంలో అన్ని దిశల్లోకి ప్రయాణిస్తూ ఏర్పడే ప్రమాదకరమైన తరంగాల శ్రేణినే సునామీ అంటారు. జపనీస్‌లో “సునామీ” అనే పదానికి సాధారణంగా “హార్బర్ వేవ్” లేదా “రేవు తరంగం” అనే అర్థం వస్తుంది. ఇది సాధారణ సముద్రపు అలలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. గాలి వల్ల ఏర్పడే అలలు ప్రధానంగా సముద్ర ఉపరితలాన్ని ప్రభావితం చేస్తే.. సునామీ సముద్రపు అడుగుభాగం నుంచి ఉపరితలం వరకు ఉన్న దాదాపు మొత్తం నీటి స్తంభం ద్వారా ప్రయాణిస్తుంది. అందుకే దాని శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
సునామీ అసలు ఎలా పుడుతుంది?
భూమి బయటి ఘన పొర అనేక భారీ టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది. ఈ ప్లేట్లు నిరంతరం చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక ప్లేట్ మరో ప్లేట్ కిందికి జారిపోతుంది. వీటిని సబ్‌డక్షన్ జోన్లు అంటారు. ప్లేట్లు ఒకదానికొకటి ఇరుక్కుపోయినప్పుడు, సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ భూకంపం సంభవిస్తుంది. అయితే ప్రతి భూకంపం సునామీని సృష్టించదు. సునామీ ఏర్పడాలంటే భూకంపం సముద్రం కింద లేదా సమీపంలో సంభవించడంతో పాటు, సముద్రపు అడుగుభాగం పెద్ద ప్రాంతంలో ఒక్కసారిగా పైకి లేదా కిందికి కదలాలి. ఆ నిలువు కదలిక వల్ల దాని పైన ఉన్న నీరు కూడా ఒక్కసారిగా స్థానభ్రంశం చెందుతుంది. నీరు తిరిగి సమతుల్య స్థితికి చేరుకునే క్రమంలో భారీ శక్తి తరంగాలుగా బయటకు వ్యాపిస్తుంది. భూకంపాలే సునామీలకు ప్రధాన కారణం. అయితే సముద్రంలో భారీ కొండచరియలు విరిగి పడటం, అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి ఇతర కారణాలతో కూడా సునామీలు ఏర్పడవచ్చు. అత్యంత అరుదైన సందర్భాల్లో సముద్రాన్ని భారీ ఖగోళ వస్తువు ఢీకొనడం కూడా కారణం కావచ్చు.
సముద్రంలో పుట్టిన సునామీ ఎందుకు కనిపించదు?
సునామీ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అది సముద్రంలో పుట్టిన వెంటనే భారీ గోడలా కనిపించదు. లోతైన సముద్రంలో సునామీ తరంగాల ఎత్తు సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. తరంగదైర్ఘ్యం మాత్రం వందల కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. అందువల్ల సముద్రంలో ప్రయాణించే పెద్ద నౌకలకు కూడా సునామీ తమ కిందుగా దూసుకెళ్తున్న విషయం తెలియకపోవచ్చు. లోతైన సముద్రంలో సునామీ ఎత్తు సాధారణంగా ఒక మీటర్ కంటే తక్కువగానే ఉండొచ్చు. అయితే దాని వేగం మాత్రం అత్యంత ఎక్కువ. సముద్రపు లోతును బట్టి సునామీ వేగం మారుతుంది. చాలా లోతైన నీటిలో ఇది గంటకు 800 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. అంటే దాదాపు జెట్ విమానం వేగంతో సమానం.
తీరానికి చేరేసరికి అసలు రూపం బయటపడుతుంది
సునామీ తీరానికి దగ్గరవుతున్న కొద్దీ సముద్రపు లోతు తగ్గుతుంది. దీంతో దాని వేగం తగ్గుతుంది. అదే సమయంలో తరంగదైర్ఘ్యం కుదుస్తుంది, నీరు పైకి పేరుకుపోవడంతో తరంగ ఎత్తు పెరుగుతుంది. తీరానికి చేరువలో నీటి ప్రవాహ తీవ్రత కూడా తీవ్రంగా పెరుగుతుంది. అందుకే సముద్రం మధ్యలో పెద్దగా కనిపించని సునామీ.. తీరానికి వచ్చేసరికి పెను విధ్వంసకర శక్తిగా మారుతుంది. సినిమాల్లో చూపించినట్టుగా ప్రతి సునామీ భారీగా వంకర తిరిగి విరిగే అలలా ఉండాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో అది వేగంగా పెరుగుతున్న వరదలా తీరంలోకి దూసుకొస్తుంది. ఆ ప్రవాహంలో నీటితో పాటు కార్లు, పడవలు, చెట్లు, శిథిలాలు కొట్టుకుపోతాయి.
మొదటి అలే చివరి అల కాదు!
సునామీ అంటే ఒకే ఒక్క అల కాదు. ఇది అనేక తరంగాలతో కూడిన శ్రేణి. మొదటి అల వచ్చిన తర్వాత ప్రమాదం ముగిసిందని భావించడం చాలా ప్రమాదకరం. తర్వాత వచ్చే అలలు మరింత పెద్దవిగా, బలంగా ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో సునామీ తరంగాల ప్రభావం గంటల పాటు కొనసాగవచ్చు. అందుకే మొదటి అల వెళ్లిపోయిన వెంటనే తీరానికి తిరిగి వెళ్లకూడదు.
సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్తే?
సునామీ రాకను ముందే గుర్తించడానికి కొన్ని సహజ హెచ్చరికలు ఉంటాయి.
తీర ప్రాంతంలో ఉన్నప్పుడు:
బలమైన భూకంపం సంభవించడం
భూకంపం వల్ల నిలబడటం కష్టంగా అనిపించడం
సముద్రం ఒక్కసారిగా అసాధారణంగా వెనక్కి వెళ్లిపోవడం
సముద్ర మట్టం అకస్మాత్తుగా పెరగడం
సముద్రం వైపు నుంచి అసాధారణమైన భారీ గర్జన వినిపించడం
వంటివి సునామీ హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిపోతే, ఆ ప్రాంతంలో ఆసక్తితో సముద్రం దగ్గరకు వెళ్లడం కాకుండా వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. ముఖ్యంగా.. బలమైన లేదా ఎక్కువసేపు కొనసాగే భూకంపం అనిపిస్తే అధికారిక హెచ్చరిక కోసం వేచి ఉండకుండా తీర ప్రాంతం నుంచి దూరంగా, ఎత్తైన ప్రదేశానికి వెళ్లడం అత్యంత కీలకం.
సునామీని ఎలా గుర్తిస్తారు?
సునామీని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ అది ఎక్కడ, ఎంత ప్రమాదకరంగా ప్రభావం చూపవచ్చో ముందుగానే అంచనా వేయడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం పలు సాంకేతిక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. భూకంపాలను గుర్తించేందుకు సిస్మిక్ స్టేషన్లు, సముద్రపు అడుగున నీటి ఒత్తిడిలో మార్పులను గుర్తించేందుకు బాటమ్ ప్రెషర్ రికార్డర్లు, సముద్ర మట్టం మార్పులను నమోదు చేసేందుకు టైడ్ గేజ్‌లు, సముద్రంలోని సునామీ తరంగాలను గుర్తించేందుకు ట్సునామీ బాయ్‌లు వంటి పరికరాలు ఉపయోగిస్తారు. భూకంపం సంభవించిన వెంటనే దాని స్థానం, లోతు, తీవ్రత వంటి వివరాలను విశ్లేషించి.. అది సునామీని సృష్టించే అవకాశం ఉందా అనే విషయాన్ని అంచనా వేస్తారు. సముద్ర మట్టం నుంచి వచ్చే రియల్‌టైమ్ సమాచారంతో ఆ అంచనాలను మరింత మెరుగుపరుస్తారు.
హైదరాబాద్ నుంచే భారత్‌కు సునామీ హెచ్చరికలు
భారతదేశంలో సునామీ పర్యవేక్షణకు కీలక కేంద్రం హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS). దాని ఆధ్వర్యంలో పనిచేసే Indian Tsunami Early Warning Centre (ITEWC) భారతదేశానికి సునామీ హెచ్చరికలు జారీ చేసే జాతీయ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ వ్యవస్థ 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ పనిచేస్తుంది. భూకంప సమాచారం, సముద్ర మట్ట పరిశీలనలు, సునామీ బాయ్‌ల డేటా, టైడ్ గేజ్‌ల సమాచారం, కంప్యూటర్ మోడల్స్ ఆధారంగా ప్రమాదాన్ని అంచనా వేసి సంబంధిత అధికారులకు హెచ్చరికలు అందిస్తుంది. 2004 సునామీ తర్వాత భారత్ తన సునామీ హెచ్చరిక వ్యవస్థను భారీగా అభివృద్ధి చేసింది. INCOIS ప్రకారం, భారత సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అక్టోబర్ 2007 నుంచి పూర్తిస్థాయి 24×7 వ్యవస్థగా పనిచేస్తోంది.
2004 డిసెంబర్ 26.. ప్రపంచాన్ని కుదిపేసిన సునామీ
సునామీ ప్రమాదాన్ని ప్రపంచం మరచిపోలేని విధంగా గుర్తుచేసిన ఘటన 2004 హిందూ మహాసముద్ర సునామీ. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా సమీపంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాని కారణంగా ఏర్పడిన సునామీ హిందూ మహాసముద్రంలోని అనేక దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ సహా 17 దేశాల్లో దీని ప్రభావం కనిపించింది. దాదాపు 2.28 లక్షల మంది మరణించారు లేదా గల్లంతై మృతులుగా భావించబడ్డారు. భారత్‌లో కూడా 16 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అండమాన్-నికోబార్ దీవులు, తమిళనాడు సహా తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్తు తర్వాత హిందూ మహాసముద్ర ప్రాంతంలో సునామీ హెచ్చరిక వ్యవస్థల అవసరం మరింత స్పష్టమైంది. భారతదేశం కూడా ఆధునిక సునామీ పర్యవేక్షణ, హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది.
ప్రాణాలను కాపాడేది టెక్నాలజీ మాత్రమే కాదు..
సాంకేతిక వ్యవస్థలు సునామీని గుర్తించి హెచ్చరికలు ఇవ్వగలవు. కానీ సముద్రానికి చాలా దగ్గరగా సునామీ పుడితే స్పందించడానికి సమయం చాలా తక్కువగా ఉండవచ్చు. అందుకే తీర ప్రాంత ప్రజలకు సహజ హెచ్చరిక సంకేతాలపై అవగాహన అత్యంత ముఖ్యం. బలమైన భూకంపం అనిపిస్తే.. సముద్రం అసాధారణంగా వెనక్కి వెళ్లిపోతే.. లేదా సముద్రం నుంచి భారీ గర్జన వినిపిస్తే.. కారణం తెలుసుకోవడానికి అక్కడే నిలబడకండి. వెంటనే తీర ప్రాంతం నుంచి దూరంగా, ఎత్తైన ప్రదేశానికి వెళ్లండి.
సునామీని మనం ఆపలేం. కానీ అది ఎలా పుడుతుంది, ఎలా ప్రయాణిస్తుంది, ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది అనే విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చు.