Reading Time: 2 minutes
Supreme Court Gyanesh Kumar Suspension Eci Sir Row

Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. రాజ్యాంగబద్ధమైన ఈ అత్యున్నత సంస్థ చట్టానికి లోబడే పనిచేస్తుందని తాము భావిస్తున్నట్లు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) నోటీసులు జారీ చేస్తూ పూర్తి సమాధానం చెప్పాలని ఆదేశించింది. సోషల్ యాక్టివిస్ట్ రాకేష్ కుమార్ సింగ్, లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠిలు దాఖలు చేసిన ఈ పిటిషన్లలో ముఖ్యంగా.. ఎస్ఐఆర్ (SIR), ఫామ్-6 మార్పులతో పాటు ఎన్నికల కమిషన్ తీసుకున్న అనేక ఇతర నిర్ణయాలు చట్టబద్ధమైన ప్రక్రియలను ఉల్లంఘిస్తూ తీసుకున్నవేనని తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్ణయమైనా ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయం ఆధారంగా మాత్రమే జరగాలని వారు గుర్తుచేశారు.

పిటిషనర్ రాకేష్ కుమార్ సింగ్ తరఫున సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ కోర్టులో తన వాదనలను వినిపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మూల స్వరూపం, అందులో తెచ్చిన మార్పులతో పాటు సెక్షన్ 10(2), 10(3)లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొత్తగా వచ్చిన చట్టం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు విపరీతమైన అధికారాలను కట్టబెట్టిందని, పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఆయనపై ఎలాంటి విచారణ జరగకుండా ప్రత్యేక రక్షణ (ఇమ్యూనిటీ) కల్పించారని వికాస్ సింగ్ ఆరోపించారు. దేశ ప్రధానికి కూడా లేని, చివరికి న్యాయమూర్తులకు కూడా లభించని ఇటువంటి రక్షణను సీఈసీకి ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ, పదవిలో ఉన్నంత వరకు రక్షణ అనేది పాత చట్టంలోనూ ఉందని తెలిపారు. అయితే, ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా రక్షణ పొడిగించారని వికాస్ సింగ్ బదులిచ్చారు. దీనికి సంబంధించి ఆ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉందని సీజేఐ గుర్తుచేయగా, తాము ఇక్కడ చట్టాన్ని సవాలు చేయడం లేదని, అసలు ఎన్నికల కమిషన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే తమ ఉద్దేశమని లాయర్ స్పష్టం చేశారు.

అందుకే జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే సీఈసీ పదవి నుంచి సస్పెండ్ చేసి, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈసీ కార్యకలాపాలను నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. గతంలో ‘అనూప్ బరన్‌వాల్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని భాగస్వామిగా చేసే పాత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని కోరారు. సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, చట్టం ప్రకారం వీలైనంతవరకు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే ఈసీ నడవాలని స్పష్టం చేశారు. కమిషన్ నిర్వహణ విధానాలపై తీసుకునే నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండాలని, సాధారణ పనితీరుకు సంబంధించిన నిర్ణయాలు మెజారిటీ ఆధారంగా ఉండవచ్చని వాదించారు. విచారణ సమయంలో సీజేఐ జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్లు కేవలం ఒక వార్తా పత్రిక కథనం ఆధారంగా వాదనలు వినిపిస్తున్నారని, కేవలం దాన్ని చూసి కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ముందుగా ఎన్నికల సంఘం నుంచి సమాధానం రానివ్వాలని పేర్కొన్నారు. దీనిపై వికాస్ సింగ్ స్పందిస్తూ.. ఈసీ సొంతంగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ కూడా సదరు వార్తా కథనాన్ని ఖండించలేదని, ఎన్నికల సంఘం చట్టబద్ధమైన వ్యవస్థలను కాలరాయలేదని అన్నారు. దానికి స్పందించిన సీజేఐ, “ముందుగా వారిని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనివ్వండి. దేశంలో ఒక స్పష్టమైన చట్టం ఉంది, వారు దాన్ని కచ్చితంగా పాటించే ఉంటారని మేము భావిస్తున్నాం. ఒకవేళ ఏవైనా ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే ఆ నిర్ణయాలను మేమే రద్దు చేస్తాం” అని స్పష్టం చేశారు. అయితే, ఒకసారి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆ ఫలితాలను రద్దు చేయడం ఎలా సాధ్యమవుతుందని, అందుకే ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేందుకు కోర్టు తక్షణమే మధ్యంతర చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది గట్టిగా విజ్ఞప్తి చేశారు.