
ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కిక్కిరిసిన తరగతి గదులు, అధ్వాన్నంగా మారిన మౌలిక వసతులు, తరగతుల రద్దు వంటి సమస్యలపై హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో 2.5 లక్షల మందికిపైగా పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క పారిస్‌లోనే 56 వేల మంది నిరసనలో పాల్గొన్నట్లు వెల్లడించింది.
ఇక ఈ ఉద్యమం సందర్భంగా హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఫ్రాన్స్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి 5,060 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 87 శాతం మంది మైనర్లే. 1,802 మందిపై ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
పారిస్ శివారులోని సెయింట్-ఎక్సుపెరీ హైస్కూల్‌లో సెప్టెంబర్‌లో ఈ ఆందోళనకు బీజం పడింది. ఉపాధ్యాయుల కొరత, సరైన వసతులు లేకపోవడంపై విద్యార్థులు, టీచర్లు కలిసి నిరసన చేపట్టారు. పాఠశాలకు అదనపు సిబ్బందిని కేటాయించడంతో అక్కడి సమ్మె ముగిసినా.. అదే తరహా సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర పాఠశాలల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. తర్వాత విద్యార్థులు పారిస్‌తో పాటు లిల్లీ, మార్సెయిల్, లియోన్, రెన్నెస్ వంటి నగరాలకు ఉద్యమాన్ని విస్తరించారు. పాఠశాలల ప్రవేశ ద్వారాలను దిగ్బంధించడం, తరగతులను బహిష్కరించడం, రోడ్లపై నిరసనలు చేపట్టడం మొదలుపెట్టారు. అక్టోబర్ ప్రారంభంలోనే 1,000కుపైగా హైస్కూళ్లు నిరసనల ప్రభావానికి గురయ్యాయి.
ఫ్రాన్స్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలే ప్రస్తుత ఉద్యమానికి ప్రధాన కారణంగా మారాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు,
టీచర్లు అందుబాటులో లేక తరగతులు రద్దు కావడం, సరైన డెస్కులు, కుర్చీలు లేకపోవడం,
మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, పాఠశాల భవనాల పరిస్థితి అధ్వాన్నంగా మారడం, వేడి వాతావరణాన్ని తట్టుకునే సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ప్రస్తావిస్తున్నారు. 2008తో పోలిస్తే ఇప్పుడు హైస్కూల్ విద్యార్థుల సంఖ్య సుమారు 2.5 లక్షలు పెరిగినా.. ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 70 శాతం ప్రభుత్వ తరగతి గదుల్లో 30 మందికిపైగా విద్యార్థులు ఉంటున్నట్లు సమాచారం.
ఈ ఉద్యమం క్రమంగా విద్యార్థులకే పరిమితం కాకుండా పెద్దల మద్దతును కూడా సంపాదిస్తోంది. టీచర్లు, తల్లిదండ్రులు, కార్మిక సంఘాలు కూడా మంగళవారం జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని కొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మరోవైపు నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలిపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో నిరసనలు శాంతియుతంగా సాగుతున్నప్పటికీ.. కొన్ని చోట్ల విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చెత్త బుట్టలు, పాఠశాల ఫర్నిచర్ వంటి వస్తువులకు నిప్పు పెట్టిన ఘటనలు నమోదయ్యాయి. కొందరు నిరసనకారులు పోలీసులపై వస్తువులు విసిరారు. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలు, ఇతర గుంపు నియంత్రణ చర్యలను ఉపయోగించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 215 మంది విద్యార్థులు, 715 మంది పోలీసులు గాయపడ్డారు. 24 పాఠశాలలు తగలబెట్టడం లేదా ధ్వంసం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
లెన్స్ నగరంలో జరిగిన ఘర్షణల్లో 15 ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల ఉపయోగించిన గ్రెనేడ్‌కు సంబంధించిన ఘటనలో అతడి చేతికి తీవ్ర గాయం కావడంతో చేయి కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు పోలీసులపై అధిక బలప్రయోగం ఆరోపణలు కూడా వచ్చాయి. మానవ హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు నిరసనకారుల్లో పెద్ద సంఖ్యలో మైనర్లు ఉన్నందున పోలీసుల చర్యలు సముచితంగా ఉండాలని డిమాండ్ చేశాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా పోలీసుల బలప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్ అధికారులు పోలీసుల వ్యవహారశైలిపై పలు అంతర్గత దర్యాప్తులు ప్రారంభించారు.
ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. హింసకు ఎలాంటి అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలను తగలబెట్టడం వల్ల వాటి పరిస్థితి మెరుగుపడదని, ఉపాధ్యాయులపై దాడులు చేయడం వల్ల టీచర్ల కొరత తీరదని అన్నారు. అదే సమయంలో విద్యార్థులపై పోలీసు అణచివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్న ఆరోపణలను లెకోర్ను ఖండించారు. నిరసనల్లో చోటుచేసుకున్న గాయాలను ఆయన ప్రస్తావిస్తూ.. కొన్ని ఘటనలు ప్రమాదవశాత్తూ జరిగి ఉండవచ్చని చెప్పారు.
ఫ్రాన్స్‌లో 2027 అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో విద్యార్థుల ఉద్యమం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం LFIపై దృష్టి సారిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం పోలీసు చర్యలపై ఆధారపడుతోందని విమర్శిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఉద్యమం ఒకే పాఠశాలలో మొదలైన సమస్యను దాటి దేశవ్యాప్త ఆందోళనగా మారింది. వేలాది మంది మైనర్లు అరెస్టు కావడం, వందలాది పాఠశాలలు ప్రభావితమవడం, టీచర్లు-తల్లిదండ్రులు-కార్మిక సంఘాలు కూడా ఉద్యమంలో చేరడంతో ఫ్రెంచ్ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు విద్యార్థుల అసంతృప్తికి మూలమైన విద్యా వ్యవస్థ సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా.. మరోవైపు హింసాత్మక ఘటనలను అదుపు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది.