
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీసు అధికారి వివేక్ భగత్‌కు ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) ఉన్న వివేక్ అదనపు డిప్యూటీ కమిషనర్‌గా ప్రమోట్ అయ్యారు. మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన రెండు రోజులకే ప్రమోషన్ లభించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపు ఆరోపణలకు పాల్పడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోకుండా ప్రమోషన్ ఇవ్వడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పలువురు ఆందోళనకు దిగారు. ఈ ప్రొటెస్ట్‌ను కవర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఏసీపీ వివేక్ భగత్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ మేరకు జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. మహిళా జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే ఏసీపీ వివేక్ భగత్ కు ప్రమోషన్ ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాలు, విపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ పోలీసుల వివరణ:
మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్ భగత్‌కు ప్రమోషన్ ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో వివేక్ భగత్ ప్రమోషన్ అంశంపై ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ పదోన్నతి సాధారణ కాలపరిమితి ప్రక్రియలో భాగమేనని, సదరు ఆరోపణలు రాకముందే ఈ ప్రమోషన్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని క్లారిటీ ఇచ్చారు.