
సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ .. స్టార్ హీరోలు.. గ్రాండ్ విజువల్స్ ఉంటేనే విజయం సాధిస్తుందనే లెక్కలకు రోజురోజుకీ బ్రేక్ పడుతోంది. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద షేక్ చేయగలదని మరోసారి నిరూపించింది ‘హనుమాన్ అంశ్’ . బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షలను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ ‘హనుమాన్ అంశ్’ చిత్రం కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనంగా మారింది. సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అక్టోబర్ 9న తెలుగులో థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఈ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘హనుమాన్ అంశ్’ రూ.2 కోట్లతో సినిమా తీసి రూ.400 కోట్లు రాబట్టడం చూస్తుంటే.. కోట్ల రూపాయలు ఖర్చు చేసే సినిమాలకు ఇది చెంపపెట్టు లాంటిదని రవిశంకర్ అన్నారు. భారీగా ఖర్చు చేసినా సినిమా ఎంత వసూలు చేస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ‘హనుమాన్ అంశ్’ నిజమైన పాన్ ఇండియా సినిమాకు ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.
అంతేకాదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్, ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై కూడా రవిశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జాన్వీ కపూర్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వివాదాన్ని ప్రస్తావిస్తూ, టెక్నాలజీని ఉపయోగించి మహిళలను వేధించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో ఆధ్యాత్మికత, మంచి ఆలోచనలు పెంచే ‘హనుమాన్ అంశ్’ లాంటి సినిమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
నీమ్ కరోలి బాబా స్ఫూర్తితో రూపొందిన ‘హనుమాన్ అంశ్’లో ఆధ్యాత్మికతతో పాటు బలమైన సందేశం కూడా ఉందని ఆయన తెలిపారు. తెలుగు వెర్షన్‌ను అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి.. రూ.2 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు వెళ్లిన ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు నిర్మాతలకు ఒక్కటే చెబుతోంది. బడ్జెట్ కాదు, కంటెంట్‌నే ప్రేక్షకులు గెలిపిస్తారు.