
స్టాక్ మార్కెట్లు గత కొంతకాలంగా ఆటుపోట్లకు లోనవుతుండటం, నిఫ్టీ సైతం ఒకే రేంజ్ లో కదలాడుతుండటంతో ఇన్వెస్టర్లలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనే సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ జైనమ్ బ్రోకింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ మిలన్ పారిఖ్ ఇన్వెస్టర్లకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో బ్లైండ్ గా ఎందులోనూ పెట్టుబడి పెట్టకుండా అసెట్ అలకేషన్ విధానాన్ని ఫాలో అవటం బెటర్ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈక్విటీలు, బంగారం, ఫిక్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్ల పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలిద్దాం.
ఈక్విటీ మార్కెట్ల విషయానికి వస్తే.. గత 2 సంవత్సరాలుగా నిఫ్టీ 50 ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు క్రమంగా స్థిరపడుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశీయ తయారీ రంగం, మౌలిక వసతులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలు మంచి వృద్ధిని కనబరిచే అవకాశం ఉంది. అయితే కేవలం ఇండెక్స్ స్థాయిలను చూసి భయపడకుండా.. బలమైన బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, స్థిరమైన ఆదాయాలు ఉన్న కంపెనీలను సెలెక్టివ్‌గా ఎంచుకోవడం ముఖ్యం. దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇక గోల్డ్ అండ్ సిల్వర్ గత కొన్ని సంవత్సరాల్లో అద్భుతమైన రాబడులను అందించాయి. అయితే భారీ ర్యాలీ తర్వాత కేవలం గతాన్ని చూసి కొత్తగా భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల కొంత రిస్క్ ఉంటుందని పారిఖ్ హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నుంచి పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవడానికి గోల్డ్ ఒక మంచి డైవర్సిఫికేషన్ సాధనంగా ఉపయోగపడుతుందని, దీనిలో క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం మేలని తెలిపారు.
ఇక స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఫిక్స్‌డ్ ఇన్‌కం లేదా డెట్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ అవకాశాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 10 సంవత్సరాల జీ-సెక్ (G-Sec) ఈల్డ్ సుమారు 7% వద్ద ఉండటం వల్ల, మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోరుకునే మదుపరులకు ఇది మంచి స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే మార్కెట్ క్రాష్ అయినప్పుడు లేదా మంచి కొనుగోలు అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకునేందుకు లిక్విడ్ క్యాష్‌ను కూడా చేతిలో ఉంచుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే.. రానున్న కాలంలో ఉన్న డబ్బంతా ఒకే చోట కూడబెట్టకుండా ఈక్విటీలు, బంగారం, ఫిక్స్‌డ్ ఇన్‌కంల మధ్య సరైన నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేయటం సరైన వ్యూహమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.