
Eye Health: రోజూ తలనొప్పి వస్తోందని పెయిన్ కిల్లర్ వేసుకుని సరిపెట్టుకుంటున్నారా? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడ్డట్లే. తలనొప్పి కేవలం అలసట లేదా మైగ్రేన్ వల్ల మాత్రమే కాదు.. మీ కంటి చూపు ప్రమాదంలో పడిందనడానికి ప్రధాన హెచ్చరిక కూడా కావచ్చని ప్రముఖ కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన కంటి సమస్యలు బయటపడకుండా లోలోపలే ముదిరిపోయి, చివరకు అంధత్వానికి దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు లేని సైలెంట్ కిల్లర్స్.. గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి
సెంటర్ ఫర్ సైట్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్‌దేవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యాటరాక్ట్ (శుక్లాలు), గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, కార్నియా రుగ్మతలు నేడు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంటి చూపు మందగించడానికి ప్రధాన కారణం.. కంటి సహజ లెన్స్ మసకబారడం వల్ల రాత్రిపూట చూడటం కష్టమవడం, వెలుతురును చూస్తే కళ్లు జిగేల్‌మనడం వంటివి జరుగుతాయి. అయితే సకాలంలో ఆధునిక సర్జరీ ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చని ఆయన చెబుతున్నారు. అలాగే ఎలాంటి ముందస్తు సిగ్నల్స్ లేకుండా ఆప్టిక్ నెర్వ్‌ను శాశ్వతంగా దెబ్బతీసే సైలెంట్ కిల్లర్ గ్లాకోమా (నీటికాసులు) అని చెప్పారు. దీనిని సకాలంలో గుర్తించకపోతే చూపును తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం అని అన్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతిని డయాబెటిక్ రెటినోపతి సమస్య వస్తుందని, దీని ద్వారా దృష్టి క్షీణిస్తుందన్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి
సాధారణంగా కనిపించే కొన్ని మార్పులను అస్సలు విస్మరించకూడదని వైద్యులు చెబుతున్నారు.
1. తరచూ విపరీతమైన తలనొప్పి రావడం.
2. కళ్లలో నిరంతరం నొప్పి, మంట లేదా ఒత్తిడి అనిపించడం.
3. ఉన్నట్టుండి లేదా క్రమంగా చూపు మసకబారడం (Blurry vision).
4. రాత్రి సమయాల్లో వెలుతురు చుట్టూ ఇంద్రధనుస్సు లాంటి వలయాలు (Halos) కనిపించడం.
బీపీ, షుగర్ ఉన్నవారు లేదా కుటుంబంలో గ్లాకోమా చరిత్ర ఉన్నవారు కంటి సమస్యలు లేకపోయినా క్రమం తప్పకుండా పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
డిజిటల్ యుగంలో కళ్లను కాపాడుకునే గోల్డెన్ రూల్: 20-20-20
రోజంతా కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్లు చూసేవారికి ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ నుంచి రక్షణ పొందేందుకు 20-20-20 రూల్ తప్పనిసరి అంటున్నారు. అంటే.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి దృష్టిని పక్కకు మళ్లించి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. దీనితో పాటు స్క్రీన్‌ను సరైన దూరంలో ఉంచుకోవడం, తగినంత వెలుతురులో పనిచేయడం, కనురెప్పలు తరచూ ఆర్పడం, కంటినిండా నిద్రపోవడం ద్వారా చూపును పదిలంగా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.