
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఎస్.ఎం. పేటలో మెగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఇదే తొలి గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రాజెక్టు అని తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రూ.9.60 కోట్ల వ్యయంతో ఈ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం కేటాయించిన రూ.9.60 కోట్లతో పాటు అవసరమైతే మరిన్ని నిధులను కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.నియోజకవర్గ ప్రజలతో తమకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. తనకు, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి పిల్లలు లేరని, నియోజకవర్గ ప్రజలనే తమ పిల్లలుగా భావిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమకు అవకాశం కల్పించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అనంతరం దేశ రాజకీయాలపై మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.