Reading Time: 2 minutes
Flydubai Co Pilot Hijack Plot July September Attack

ఫ్లైదుబాయ్ విమాన ఘటనకు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వస్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి హైజాక్ చేసి భారీ కుట్రకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా భారత్ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. అయితే స్మిత్ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు వేగంగా స్పందించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు.

ప్రస్తుతం కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి యూఏఈ దర్యాప్తులో ఉన్నాడు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దీంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కో-పైలట్ అల్-హమ్మామి గత జూలైలోనే ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. విమానాన్ని 9/11 తరహాలో దాడికి ఉపయోగించాలని అతడు భావించినట్లు సమాచారం. టెల్‌అవీవ్‌లోని ఓ ఆకాశహర్మ్యం లేదా బెన్ గురియన్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.

అయితే జూలైలో తాను లక్ష్యంగా చేసుకున్న విమానంలో పనిచేసే సిబ్బందిలో ఒక వ్యక్తి తనకు స్నేహితుడని గుర్తించడంతో అల్-హమ్మామి ఆ ప్రణాళికను విరమించుకున్నట్లు సమాచారం. ఆ వ్యక్తి కూడా అదే విమానంలో ఉండాల్సి ఉండటంతో హైజాక్ ప్లాన్‌ను అమలు చేయలేదని దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. తాజా వివరాలతో.. అల్-హమ్మామి ఫ్లైదుబాయ్‌లో ఎలా ఉద్యోగం పొందాడు? గతంలోనే అతడిపై భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ టెల్‌అవీవ్‌ మార్గంలో విమానాలు నడిపే అవకాశం ఎలా లభించింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇజ్రాయెల్‌ దర్యాప్తు గురించి తెలిసిన ఇద్దరు అధికారులు రాయిటర్స్‌కు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 30న జరిగిన దాడికి సంబంధించిన ప్రణాళికను ఫ్లైదుబాయ్‌లో చేరకముందే కో పైలట్ అల్-హమ్మామి సిద్ధం చేసుకున్నట్లు యూఏఈ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఫిబ్రవరిలో దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫ్లైదుబాయ్‌లో చేరినట్లు నివేదిక పేర్కొంది. దీంతో అతడి నియామక ప్రక్రియ, నేపథ్య పరిశీలన, టెల్‌అవీవ్‌ మార్గంలో విధులు కేటాయించే ముందు నిర్వహించిన భద్రతా తనిఖీలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇటీవలి నెలల్లో ఫ్లైదుబాయ్‌లో పనిచేస్తున్న సమయంలో అల్-హమ్మామి బెన్ గురియన్ విమానాశ్రయాన్ని పలుమార్లు సందర్శించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జూన్‌లో చేసిన ఓ పర్యటన సందర్భంగా దాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెల్‌అవీవ్‌కు విమానాలు నడిపే ఎయిర్‌లైన్స్‌ గురించి ప్రత్యేకంగా తెలుసుకున్న తర్వాతే ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు అల్-హమ్మామి యూఏఈ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.

అల్-హమ్మామి గత ఉద్యోగ చరిత్ర కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. ది వాల్‌స్ట్రీట్ జర్నల్‌ ప్రకారం.. ఓమన్‌లో పనిచేసిన సమయంలో అతడి ఆన్‌లైన్ కార్యకలాపాలను అధికారులు పరిశీలించారు. అతడికి తీవ్రవాద భావజాలంపై గణనీయమైన ఆసక్తి ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు నివేదిక పేర్కొంది. అతడు గతంలో ఒమన్ ఎయిర్‌లో పనిచేశాడు. అనంతరం విమానం నడపకుండా నిషేధించి, డీ-రాడికలైజేషన్ కార్యక్రమానికి పంపినట్లు సమాచారం. ఆ తర్వాత అతడిని డెస్క్ ఉద్యోగానికి బదిలీ చేసినట్లు నివేదిక తెలిపింది. అయితే ఓమన్ అధికారులు ఈ ఆందోళనలకు సంబంధించిన సమాచారాన్ని ఇతర ప్రభుత్వాలు లేదా ఎయిర్‌లైన్స్‌తో విస్తృతంగా పంచుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌ పేర్కొంది. ఫిబ్రవరిలో అల్-హమ్మామిని నియమించుకునే ముందు ఫ్లైదుబాయ్.. అతడి గత ఉద్యోగ సంస్థ అయిన ఒమన్ ఎయిర్‌ను సంప్రదించి నేపథ్య తనిఖీ చేయలేదని కూడా నివేదిక తెలిపింది.

ఫ్లై దుబాయ్ విమానం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయల్దేరింది. విమానంలో మొత్తం 174 మంది ఉన్నారు. ఎక్కువ మంది ఇజ్రాయెల్ ప్రయాణికులే ఉన్నారు. అయితే విమానం గాల్లో ఉండగా కో పైలట్.. పైలట్ స్మిత్‌పై గొడ్డలితో దాడి చేశాడు. మొత్తానికి అతి కష్టం మీద స్మిత్ కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు విమానాన్ని నియంత్రించారు. క్షేమంగా ల్యాండ్ చేశారు. కో పైలట్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటనను ఇజ్రాయెల్‌, యూఏఈ అధికారులు ‘టెర్రరిస్ట్ అటాక్‌’గా అభివర్ణించారు. రాయిటర్స్‌ వివరించిన దర్యాప్తు ప్రకారం.. విమానం జోర్డాన్‌ గగనతలంలోకి చేరే వరకు వేచి ఉండి ఆ తర్వాత విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలని అల్-హమ్మామి భావించినట్లు సమాచారం. అలా చేయడం ద్వారా ముందుగానే అనుమానం రాకుండా చూసుకోవడంతో పాటు.. దాడిని అమలు చేయడానికి తగినంత సమయం లభిస్తుందని అతడు భావించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇక నిందితుడికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది.