Reading Time: 2 minutes
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

చాలామంది చర్మ సంరక్షణలో భాగంగా ముఖం, జుట్టు, చేతులపై చూపించే శ్రద్ధను పాదాలపై పెట్టరు. రోజంతా శరీర భారాన్ని మోసే పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మడమలు పొడిబారి, పగుళ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల వేళ అందమైన దుస్తులు ధరించినప్పుడు ఈ పగిలిన మడమలు ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పగుళ్లు తీవ్రమై తీవ్రమైన నొప్పి, మంట, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా, వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే పగిలిన మడమలను ఎలా మృదువుగా మార్చుకోవచ్చో నిపుణులు వివరిస్తున్నారు.

గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టండి

మడమలపై పేరుకుపోయిన గట్టి చర్మాన్ని మృదువుగా చేయడానికి గోరువెచ్చని నీటి ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది.

  • ఒక బకెట్ లేదా టబ్‌లో సరిపడా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
  • అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ , కొన్ని చుక్కల మైల్డ్ షాంపూ, మరియు కొద్దిగా ఓట్‌మీల్ లేదా చక్కెర పొడిని కలపాలి.
  • ఈ మిశ్రమంలో పాదాలను 10 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • ఎప్సమ్ సాల్ట్ చనిపోయిన చర్మ కణాలను సులభంగా తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఓట్‌మీల్ మంటను తగ్గించి చర్మానికి ఉపశమనం కలిగిస్తే, చక్కెర సహజంగా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

సున్నితంగా స్క్రబ్ చేయడం

  • నీటిలో నానిన తర్వాత మడమలపై ఉన్న మృతకణాలు మెత్తబడతాయి.
  • ఇప్పుడు ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైలర్ ఉపయోగించి వృత్తాకారంలో సున్నితంగా రుద్దాలి.
  • చర్మం బాగా గట్టిపడి, మొండి పగుళ్లు ఉంటే లాక్టిక్ యాసిడ్ లేదా గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ప్రత్యేక ఫుట్ క్రీములను వాడటం వల్ల డెడ్ స్కిన్ వేగంగా తొలగిపోతుంది.
  • ముఖ్య గమనిక: చర్మాన్ని గట్టిగా లేదా అతిగా రుద్దకూడదు. అలా చేస్తే పగుళ్లు మరింత పెద్దవై రక్తం రావడం లేదా చర్మం దెబ్బతినడం జరగవచ్చు.

తేమను నిలిపే మాయిశ్చరైజింగ్

స్క్రబ్ పూర్తయిన తర్వాత కాళ్లను మెత్తని టవల్‌తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ వెంటనే పాదాలకు తేమను అందించడం చాలా ముఖ్యం. మంచి మాయిశ్చరైజర్ లేదా ఇంట్లోనే లభించే కొబ్బరి నూనె, స్వచ్ఛమైన తేనె లేదా కలబంద జెల్‌ను మడమలకు బాగా పట్టించాలి. రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ లేదా నూనె రాసి, కాటన్ సాక్స్ ధరించాలి. ఇది తేమను ఆవిరైపోకుండా అడ్డుకుని, మడమలు త్వరగా కోలుకునేలా చేస్తుంది.

క్రమం తప్పని సంరక్షణే పరిష్కారం

ఈ ఫుట్ కేర్ విధానాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాటిస్తే చాలు. క్రమం తప్పకుండా శుభ్రపరచడం, డెడ్ స్కిన్ తొలగించడం, నిత్యం మాయిశ్చరైజ్ చేసుకోవడం ద్వారా పగుళ్లు పూర్తిగా తగ్గి పాదాలు కోమలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.

(గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన పగుళ్లు, నొప్పి లేదా డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.)