
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన కొనసాగుతోంది.. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన భారత నౌకాదళ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (FSS-1) ‘సూర్య’ జలప్రవేశం చేసింది.. రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాలకు ఇది కీలక ముందడుగుగా నిలిచింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నౌకల నిర్మాణంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ సామర్థ్యాలు భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశ రక్షణ రంగంలో HSL కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జల ఉష నౌకల తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల నిర్మాణం వరకు హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రయాణం గొప్పదని ప్రశంసించారు.
హిందుస్థాన్ షిప్‌యార్డ్ సముద్ర రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భాగస్వామిగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నావల్ డాక్‌యార్డ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ వంటి సంస్థలు నౌకల నిర్మాణం, నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్నాయని, వాటి ద్వారా MSME పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. HSLలో నిర్మిస్తున్న ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు 43,500 టన్నుల సామర్థ్యంతో ఉంటాయి. సముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నౌకాదళ నౌకలకు అవసరమైన సరఫరాలను అందించడం ద్వారా వాటి సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు ఇవి తోడ్పడనున్నాయి. FSS-1 స్టీల్ కటింగ్ జరిగిన 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశించడం దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యానికి నిదర్శనంగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అదే కార్యక్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్-5కు కీల్ వేయడంతో పాటు HSLలో అప్‌గ్రేడ్ చేసిన స్లిప్‌వే-4, 300 టన్నుల గోలియత్ క్రేన్‌ను కూడా ప్రారంభించారు. ఈ మౌలిక వసతుల ద్వారా 45,000 డెడ్‌వెయిట్ టన్నుల వరకు సామర్థ్యం కలిగిన పెద్ద, సంక్లిష్ట నౌకలను నిర్మించి జలప్రవేశం చేయించే సామర్థ్యం HSLకు పెరగనుంది. దేశ రక్షణతో పాటు ప్రపంచ సముద్ర జలాల పరిరక్షణలో అంతర్జాతీయ సముద్ర నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో కేవలం నౌకల నిర్మాణం మాత్రమే జరగడం లేదని, ఇది దేశ రక్షణ రంగ బలాన్ని పెంచే మార్గంగా మారుతోందని అన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో దేశీయంగా రక్షణ పరికరాలు, నౌకల తయారీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో భారత్‌పై నమ్మకం మరింత పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మారిటైమ్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహకారం బాగుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రక్షణ, నౌకా నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..