Reading Time: < 1 minute
Lagadapati Sridhar Comments On Theatres And Anakapalli Movie Success

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్లు, థియేటర్ల కేటాయింపులపై మరోసారి సీనియర్ నిర్మాత లగడపాటి శ్రీధర్ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారాయి.
సినీ పరిశ్రమలో కేవలం బ్రాండ్ ఇమేజ్ ఉన్న బడా నిర్మాణ సంస్థలకే ప్రాధాన్యత దక్కుతోందని, కొత్త ఆలోచనలతో వచ్చే చిన్న నిర్మాతలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఒకేసారి వరదలాగా దాదాపు 20 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. బ్రాండ్ నేమ్ ఉన్న పెద్ద బ్యానర్ల సినిమాలకు దక్కిన ప్రయారిటీ మా లాంటి చిన్న చిత్రాలకు దక్కలేదు. అక్టోబర్ చివరి వారం ఎగ్జామ్స్ ముగుస్తాయన్న అంచనాతో వచ్చాం కానీ, ఇంత భారీ రద్దీ ఉంటుందని ఊహించలేదు.” గతంలో తన సినిమా ‘ఎవడి గోల వాడిదే’ విడుదలైన నాలుగో రోజే తీసేస్తామని థియేటర్ల వాళ్లు అన్నారని, అప్పుడు ఎవరికీ పైసా అదనంగా ఇవ్వకుండా కంటెంట్‌తోనే నిలబడి సిల్వర్ జూబ్లీ కొట్టామని గుర్తు చేశారు. ‘అనకాపల్లి’ కూడా తాబేలు-కుందేలు పరుగులా మూడో రోజు నుంచే అసలైన విజేతగా నిలిచిందని అన్నారు.

మొదటి రెండు రోజులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, మౌత్ టాక్ ద్వారా సినిమా నిలబడిందని శ్రీధర్ వివరించారు. అత్యధిక టికెట్ ధరలు ఉండే ఏఎంబి (AMB) లాంటి మల్టీప్లెక్స్‌లలో సోమవారం రాత్రి షోలు సైతం హౌస్‌ఫుల్ కావడం సినిమా అసలైన స్ట్రెంగ్త్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. దర్శకుడు త్రినాధరావు నక్కిన పర్యవేక్షణ, దర్శకత్వం వహించిన కాగేషు మేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయని కొనియాడారు. ఇంటర్వెల్ బ్యాంగ్, ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ సినిమాకు ప్రాణంగా నిలిచాయని అన్నారు. ఈ సినిమాలో కీలకమైన తల్లి పాత్ర పోషించిన సీనియర్ నటి ఇంద్రజను లగడపాటి శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో తన వృద్ధ తండ్రిని పసిపాపలా చూసుకున్న ఆమె వ్యక్తిత్వం గురించి ఆయన వేదికపై ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఇంద్రజ, “హీరోయిన్‌గా నటించిన రోజుల కంటే తెరపై, బయట అందరూ నన్ను ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటే కలిగే తృప్తి వెలకట్టలేనిది. లుక్స్ డల్ అయినా సరే, మంచి భావోద్వేగాలు ఉన్న ఇలాంటి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే” అని స్పష్టం చేశారు.