Reading Time: < 1 minute
Up Rajya Sabha Polls Bjp 8 Candidates Hardeep Puri Dropped

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల(రెండేళ్ల కొకసారి) కోసం భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మాత్రం ఈసారి చోటు దక్కలేదు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి బీఎల్ వర్మను కూడా పార్టీ మళ్లీ నామినేట్ చేయలేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వారి పదవీకాలం ముగుస్తుండడంతో సోమవారం కొత్త జాబితాను ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి పలు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు గడువు అక్టోబర్ 6తో ముగియనుంది. బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించగా.. సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే రామ్ గోపాల్ యాదవ్, ధన్‌రాజ్ నత్వానీలను అభ్యర్థులుగా ప్రకటించింది. మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీలో ప్రస్తుతం ఎన్డీఏకు 289 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి 256 మంది, అప్నా దళ్ (ఎస్) నుంచి 13 మంది, నిషాద్ పార్టీ నుంచి ఐదుగురు, ఆర్‌ఎల్‌డీ నుంచి తొమ్మిది మంది, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) నుంచి ఆరుగురు ఉన్నారు. బీజేపీకి ఇద్దరు జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడా లభించే అవకాశం ఉంది, దీంతో ఎన్డీఏ వాస్తవ బలం 294కు చేరుతుంది. ఈ బలంతో ఎనిమిదవ అభ్యర్థి విజయాన్ని ఖాయం చేసుకోవడానికి ఎన్డీఏకు కేవలం మరో రెండు ఓట్లు మాత్రమే అవసరం ఉంటుంది. ఎన్నికల సమయానికి ఎవరైనా మద్దతు ఇస్తారేమో చూడాలి.