
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. నిర్మాతగా, హీరోగా, దర్శకుడిగా ఆడియన్స్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతేడాది వచ్చిన ‘క’ (KA) చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తిమ్మరాజుపల్లి TVతో నిర్మాతగా మారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడిగా మారి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌తో ‘రియాలిటీ’
కిరణ్ అబ్బవరం హీరోగా, డైరెక్టర్గా చేస్తున్న సినిమాకు ‘రియాలిటీ’ (Reality) అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గ్లింప్స్‌ను గమనిస్తే.. కిరణ్ అబ్బవరం ఇందులో ఆనందం అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఓ హోటల్‌ను నడుపుతూ కుటుంబ బాధ్యతలను చూసుకునే మధ్యతరగతి యువకుడిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. జీవితంలో పెద్ద పెద్ద విషయాల కంటే కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న ఆనందాలకే ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తిగా హీరో క్యారెక్టరైజేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా తన కుటుంబంపై ఉన్న అప్పులన్నీ తీర్చేశాననే ఆనందాన్ని కిరణ్ వ్యక్తం చేసే సన్నివేశం గ్లింప్స్‌లో ప్రత్యేకంగా నిలిచింది.
సినిమా పేరు ‘రియాలిటీ’కి తగ్గట్టుగానే.. సాధారణ మనుషుల జీవితాలు, కుటుంబ అనుబంధాలు, మధ్యతరగతి వారి భావోద్వేగాలు, రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంతోషాల చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఎలాంటి భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కంటే సహజమైన భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. గ్లింప్స్‌లో వినిపించిన ‘భజ గోవిందం’ సంగీతం కూడా సినిమాకు ప్రత్యేకమైన ఫీల్‌ను తీసుకొచ్చింది.
ఈ చిత్రంలో దేవిక భట్ హీరోయిన్ గా నటిస్తుంది. శరత్‌కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న ఈ ‘రియాలిటీ’ చిత్రాన్ని డిసెంబర్ 25, 2026న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన కిరణ్ అబ్బవరం.. దర్శకుడిగా తొలి ప్రయత్నంలో ఎలాంటి కథను చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.