
పటాన్చెరు: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. డీసీఎం ఢీ కొట్టడంతో కారు గాల్లోకి లేచి పక్క లైన్‌లోని కార్లపై పడింది. ఎగ్జిట్4 నుంచి- ఎగ్జిట్3కు వెళ్తున్న కారును డీసీఎం వాహనం అతి వేగంతో ఢీ కొట్టింది. ఒకదానికొకటి మూడు కార్లు వరుసగా ఢీకొని రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ORR సిబ్బంది క్షతగాత్రులను వెంటనే హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రికి తరలించారు.
ORRపై యాక్సిడెంట్లను నియంత్రించడానికి పోలీస్ శాఖ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉంది. నిత్యం సగటున 2.80 లక్షల వాహనాలు ORRపై రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం సగటున రోజూ ఐదారు ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వీటిని సున్నాకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
రూల్స్బ్రేక్చేస్తూ వాహనాలు నడిపేవారికి కేవలం చలాన్లు విధించడమే కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలని, అలాగే ఓఆర్ఆర్ పైకి ప్రవేశించగానే.. వాహనదారుల మొబైల్స్కు భద్రతా మెసేజ్లు పంపేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ఇప్పటికే పోలీసులకు సూచించారు. అత్యవసర సమయాల్లో రెస్పాన్స్ టైమ్ ఇప్పటివరకు 30 నిమిషాలు ఉందని, దాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అవసరమైతే ట్రాఫిక్ మార్షల్స్ సేవలు వినియోగించుకోవాలన్నారు. బ్రేక్డౌన్ మినహా ఇతరత్రా కారణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఆర్ఆర్ పై వాహనాలను ఆపకూడదని, అనివార్య పరిస్థితుల్లో ఆపాల్సి వస్తే తక్షణమే హెల్ప్లైన్కు సమాచారం ఇచ్చి, తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఎడమ వైపు చివరి లేన్‌లో మాత్రమే ఆపాలనేది పోలీసులు చేస్తున్న హెచ్చరిక.