
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివిధ విభాగాల ఏర్పాట్లపై అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులకు అనుకూలంగా, ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం కల్పించేలా పటిష్టమైన ఏర్పాట్లతో నిర్వహించామన్నారు. ఇందుకు అన్ని విభాగాలు, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం ప్రధాన కారణమని, ఇదే సమన్వయ స్ఫూర్తిని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో గతంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఈవో తెలిపారు. ఈ మేరకు పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించి, ఏ అంశాలు సక్రమంగా అమలయ్యాయి, భక్తులకు ఏ ఏర్పాట్లు మరింత అనుకూలంగా నిలిచాయి, ఎక్కడైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నాయా, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే అంశాలపై చర్చించారు. గుర్తించిన లోటుపాట్లను నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు.
భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా లాజిస్టిక్స్, అన్నప్రసాదం, వైద్య ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రవాణా తదితర అన్ని విభాగాల్లో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను వీక్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో సూచించారు.
భక్తులందరూ తిరుమలకు విచ్చేసి ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవల్లో పాల్గొని మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీటీడీ ఈవో కోరారు.ఈ సమావేశంలో అన్నప్రసాదం, పారిశుధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య సేవలు, రవాణా, పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, టీటీడీ విజిలెన్స్, పోలీసుల భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పోలీసు, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవల పూర్తి షెడ్యూల్:
- అక్టోబరు 11: అంకురార్పణం (రాత్రి 7 నుంచి 9 గంటల వరకు)
- అక్టోబరు 12: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఉదయం 9 గంటలకు), పెద్దశేష వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 13: చిన్నశేష వాహనం (ఉదయం 8 గంటలకు), హంస వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 14: సింహ వాహనం (ఉదయం 8 గంటలకు), ముత్యపుపందిరి వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 15: కల్పవృక్ష వాహనం (ఉదయం 8 గంటలకు), సర్వభూపాల వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 16: మోహినీ అవతారం (ఉదయం 8 గంటలకు), గరుడ వాహనం (సాయంత్రం 6:30 గంటలకు)
- అక్టోబరు 17: హనుమంత వాహనం (ఉదయం 8 గంటలకు), పుష్పక విమానం (సాయంత్రం 4 గంటలకు), గజ వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 18: సూర్యప్రభ వాహనం (ఉదయం 8 గంటలకు), చంద్రప్రభ వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 19: స్వర్ణరథం (ఉదయం 7 గంటలకు), అశ్వ వాహనం (రాత్రి 7 గంటలకు)
- అక్టోబరు 20: చక్రస్నానం (ఉదయం 6 గంటలకు)