Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. అప్పటినుంచే పంపిణీ.. ప్రభుత్వం డెసిషన్..!

ఏపీలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మందికి శుభవార్త. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్తగా అందిన 14 లక్షలకుపైగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అర్హులను గుర్తించడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. తొలి విడతలో సుమారు 3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో అర్హుల తుది జాబితాను విడుదల చేయనుంది. ఆ తర్వాత అక్టోబర్ 17 లేదా 18 తేదీలలో దసరా కానుకగా కొత్త పెన్షన్లను పంపిణీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం 13 రకాల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించింది. వీటిలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, దివ్యాంగుల, నేతన్న, గీత కార్మికుల, మత్స్యకారుల, డప్పు కళాకారుల, చర్మకారుల, హెచ్‌ఐవి బాధితుల, డయాలసిస్ రోగుల, ట్రాన్స్‌జెండర్ల పెన్షన్లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న మొత్తం 13 లక్షల 70 వేల మందికిపైగా లబ్ధిదారులలో అత్యధికంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్ దరఖాస్తుదారులు ఉన్నారు.

తొలి విడతలో 3 లక్షల పెన్షన్లను ఈ రెండు కేటగిరీల దరఖాస్తుదారులకే ప్రాధాన్యతనిచ్చి పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం మూడు రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, గీత కార్మికులు, నేతన్న, డప్పు కళాకారులు, మత్స్యకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్లు, హెచ్‌ఐవి బాధితులు వంటి ఇతర కేటగిరీల వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో పెన్షన్ల పంపిణీలో జాప్యం జరిగింది. వాస్తవానికి అక్టోబర్ 1న కొత్త పెన్షన్లు విడుదల చేయాలని షెడ్యూల్ చేసినా.. సెలవులు, వెరిఫికేషన్ గడువు పొడిగింపు కారణంగా ఇది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పాత పెన్షన్‌దారులకు మాత్రమే అక్టోబర్ 1న పెన్షన్లు పంపిణీ చేశారు. అక్టోబర్ మొదటి వారంలో అర్హత, అనర్హత జాబితాలు విడుదలవుతాయి. అనర్హత జాబితాలో పేరు ఉన్న వారికి, ఏ కారణం చేత అనర్హత వచ్చిందో ప్రభుత్వం తెలియజేస్తుంది. పెన్షన్ అర్హతలను నిర్ధారించడంలో ప్రభుత్వం కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది.

వయస్సు, కుటుంబానికి ఉన్న భూమి (మెట్టభూమి 10 ఎకరాలు, మాగాని 3 ఎకరాలు మించకూడదు), విద్యుత్ వినియోగం (300 యూనిట్లు మించకూడదు). ప్రభుత్వ ఉద్యోగాలు (కుటుంబంలో ఎవరికీ ఉండకూడదు), పట్టణ ఆస్తి (1000 చదరపు అడుగులు మించకూడదు), నాలుగు చక్రాల వాహనాలు, ఇతర ప్రభుత్వ పెన్షన్లు, అలాగే కుటుంబ ఆదాయం (గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలు మించకూడదు) వంటి 12 రకాల అర్హతలను పరిశీలించారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని వారికి పెన్షన్ లభించదు. ప్రస్తుతానికి పెన్షన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకునే ఏపీ సేవా పోర్టల్ లేదా ఇతర సైట్లు పనిచేయడం లేదు. దరఖాస్తుదారులు తమ స్టేటస్‌ను తెలుసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీని సంప్రదించాలి.