Reading Time: < 1 minute
Tank Bund Road Accident Hyderabad Birthday Celebration Girl Relative Killed

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా వచ్చిన ఒక కుటుంబంలో ఈ ప్రమాదం కోలుకోలేని నింపింది. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారితో పాటు ఆమె బంధువు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ అల్వాల్ పరిధిలోని జొన్నబండ ప్రాంతానికి చెందిన చిన్నారి సరాక్షి (6) పుట్టినరోజు కావడంతో, కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె జన్మదినాన్ని నగరంలో ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.

సినిమా చూసి వచ్చి.. రోడ్డు దాటుతుండగా లారీ రాకాసి

పాప పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులంతా కలిసి మొదట కూకట్‌పల్లిలోని పీవీఆర్ (PVR) థియేటర్‌లో సినిమా చూశారు. అనంతరం రాత్రి వేళ ట్యాంక్‌బండ్ వాతావరణంలో హుస్సేన్‌సాగర్ ఒడ్డున కేక్ కట్ చేయాలని భావించి అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న మగ్గం మోయుద్దీన్ విగ్రహం సమీపంలో తమ కారును పార్క్ చేశారు. కారు దిగి కేక్ కటింగ్ కోసం హుస్సేన్‌సాగర్ వైపు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది.

ఘటనా స్థలంలోనే చిన్నారి మృతి.. ఆసుపత్రిలో మరొకరు

లారీ తీవ్రస్థాయిలో ఢీకొట్టడంతో చిన్నారి సరాక్షి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ (41)ను స్థానికులు, పోలీసులు తక్షణమే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో విశ్వనాథ్ కూడా కన్నుమూశారు. ఆనందంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకల్లో కళ్లముందే చిన్నారి, బంధువు దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.