Reading Time: < 1 minute
Harish Rao Essential Prices Rice Price Rise Telangana Government

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్య పౌరుడి నడ్డి విరుస్తుంటే, వాటిని అదుపు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణా రాహిత్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సన్నబియ్యం ధరలు ఏకంగా 25 శాతం పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఉత్పత్తి పెరిగినప్పుడు మార్కెట్లో బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం రేషన్ ద్వారా ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదనడానికి, బయట మార్కెట్లో బియ్యం ధరలు అదుపు తప్పడమే ప్రధాన సాక్ష్యమని వ్యాఖ్యానించారు.

రైతుకు గిట్టుబాటు లేదు.. వినియోగదారుడికి అందుబాటు లేదు

ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు మద్దతు ధర పేరిట నామమాత్రపు ధర మాత్రమే దక్కుతుంటే, మధ్యదళారులు మాత్రం క్వింటాకు రూ.8,000 పైమాటే లాభపడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కక, ఇటు వినియోగదారుడికి అందుబాటు ధరలో సరుకులు అందక తీవ్ర అవస్థలు పడుతుంటే కేవలం మధ్యవర్తులు మాత్రమే కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కళ్లముందే ఈ దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమన్నారు. బియ్యం మాత్రమే కాకుండా ఉల్లిపాయలు రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లి నూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 కు చేరుకోవడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్ పూర్తిగా తలకిందులైందని తెలిపారు.

బ్లాక్ మార్కెటింగ్‌పై తక్షణమే దాడులు చేయాలని డిమాండ్

ధరల పర్యవేక్షణను గాలికి వదిలేసి ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ , అధిక మార్జిన్లపై తక్షణమే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సన్నబియ్యం సహా అన్ని నిత్యావసరాల ధరలకు అడ్డుకట్ట వేసి, పెరుగుతున్న ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.