Reading Time: < 1 minute
Hyderabad: షేక్‌పేట లేడీస్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

రాజధాని నగరం హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కల్పన (18) ఫ్యానుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది. మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన యువతి.. ఇలా హాస్టల్ గదిలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

ఘటనపై సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి తండ్రి రామాంజనేయులు పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో పెట్టే భోజనం నాసిరకంగా ఉండటంతో పాటు సరిగా పెట్టడం లేదని కల్పన ఇటీవల నిర్వాహకులను ప్రశ్నించిందని, దాంతో వారు తీవ్రంగా మందలించారని ఆయన పేర్కొన్నారు. హాస్టల్ నిర్వాహకుల నిందలు, మానసిక వేధింపులు తాళలేకే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ వార్డెన్, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ గదిని, మృతురాలి ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ముందు ఎవరితోనైనా మాట్లాడిందా? లేక ఏమైనా సూసైడ్ నోట్ రాసిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తోటి విద్యార్థినుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థిని మృతి చెందడానికి కారణమైన హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.