Reading Time: 2 minutes
Eluru Politics Party Switchers Tdp Ysrcp Political Future

Off The Record: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గోపీల గురించిన చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళకంటే… గాలి వాటానికి తగ్గట్టు…. గోడ మీద పిల్లిలా ఉంటూ పార్టీలు మారే నాయకుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందట. ఎన్నికలకు ముందు…. ఆ తర్వాత ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు… రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉంటున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోందని, వీళ్ళకు తమ పొలిటికల్ అవసరాలు తప్ప ఇంకేం పట్టవంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బాపతు నేతలకు ఇప్పుడో క్లిష్టమైన సమస్య వచ్చి పడిందట. వైసీపీ నుంచి టీడీపీకి, టిడిపి నుంచి వైసీపీలోకి జంప్‌ల మీద జంప్‌లు కొట్టిన వలస నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా…వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన చాలామంది 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. మరికొందరు వైసీపీలోనే కొనసాగుతున్నా లోపాయికారికంగా తెలుగుదేశాన్ని గట్టిగానే సపోర్ట్ చేశారట. ఆ ఎన్నికల్లో ఏలూరులో వైసీపీ ఘోరంగా దెబ్బతినడానికి అది కూడా ఒక కారణమని అంటారు. అయితే ఇందులో చాలామంది నాయకులు టిడిపిలో చేరే సమయంలో కీలక పదవులైన ఏలూరు మేయర్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌, ఏ ఏం సీ వంటి కీలక పదవులను ఆశించారు. అయితే… వాళ్ళు అనుకున్నదొకటి, ఇప్పుడు జరుగుతున్నది మరొకటి అన్నట్టుగా పరిస్థితులు మారాయంటున్నారు.

కూటమి నేతలు ఎన్నికల సమయంలో మమ్మల్ని వాడుకుని వదిలేశారంటూ వలస నాయకులు ఇప్పడు తెగ ఫీలైపోతున్నారట. కనీస గుర్తింపు కూడా ఇవ్వడంలేదని బాధపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఎన్నికలకు ముందు పదవుల కోసం పల్టీలు కొట్టిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అయోమయం గందరగోళం అన్నట్టుగా మారిందంటున్నారు. అయితే…. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో టిడిపిలో చేరడానికి ప్రధాన కారణం అప్పటి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యవహార శైలి అని అంటున్నారు. ఆయన్ని కారణంగా చూపిస్తూ గోడ మీది పిల్లి వాటాన్ని ప్రదర్శించారు అనేకమంది. కానీ… కొద్ది కాలానికి తాము ఎవరివల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారో… అదే నాయకుడు టిడిపిలో చేరడంతో వలస వచ్చిన నాయకుల నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయిందట.. మరోవైపు ఆయన అనుచర గణం సైతం టిడిపిలో చేరినా… తిరిగి మళ్లీ వైసీపీ గూటికే వెళ్తారనుకుంటున్న టైంలో… ఆళ్ళ నాని మరణం చాలా మంది నాయకులకు గట్టి షాకే ఇచ్చిందట. ఇక ఆయన వల్ల వైసీపీలో ఉండలేక బయటకు వచ్చాం.. తీరా టిడిపిలో కరివేపాకుల్లా తీసి పడేస్తున్నారని చాలామంది ఇప్పుడు నెత్తినోరు బాదుకుంటున్నట్టు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఇటు టిడిపిలో ఉండలేక, అటు వైసీపీలోకి వెళ్లలేక వలసనేతలు అయోమయంగా ఉన్నట్టు తెలుస్తోంది. వలస వచ్చిన పార్టీలో విలువ దక్కక, తిరిగి సొంత గూటికి చేరదామంటే అవకాశాలు లేక… అసలీ కష్టాల్ని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్ధంకాని స్థితిలో ఉన్నారట. ఏదో ఒక పదవి దక్కుతుందని వైసీపీని వదిలి కూటమిలో చేరితే మూడేళ్లు అవుతున్నా ఏ సౌండ్‌ లేదన్నది వాళ్ళ ఫీలింగ్‌. మళ్లీ ఇప్పుడు పార్టీ మారే ఆలోచన చేసినా… వైసీపీలో అవకాశాలు ఉంటాయన్న గ్యారెంటీ లేకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారయిందని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసింది. 10 ఏళ్ల పాటు ఏలూరు మేయర్‌గా చేసిన షేక్ నూర్జహాన్ పెదబాబు పరిస్థితి అంతేనట. టిడిపి నుంచి వైసిపి వైసిపి నుంచి టీడీపీలోకి మారుతూ వచ్చారు.. మరోసారి మేయర్‌ టిక్కెట్‌ దక్కించుకోవాలని చూస్తుంటే కూటమి నేతల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోందంటున్నారు. అలా అని తిరిగి వైసిపిలోకి వెళ్లలేని పరిస్థితి. ఇదే తరహాలో చాలామంది నాయకులు తమ భవిష్యత్తు ఏంటా అని జుట్టు పీక్కుంటున్నారన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఏలూరు మేయర్‌ సంగతి తర్వాత… కనీసం కార్పొరేటర్‌ టిక్కెట్లయినా దక్కుతాయన్న గ్యారంటీ లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో పార్టీలు మారడం వల్ల బ్యాడ్‌ పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదని.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో అనుకుంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నట్టు సమాచారం. వీళ్ళని చూసైనా…. ఏలూరు నియోజకవర్గంలో చీటికి మాటికి పార్టీలు మారే సంస్కృతికి బ్రేక్ పడుతుందా అనే చర్చ నడుస్తోందట.