
ఈ సోషల్ మీడియా కాలంలో ఎప్పుడు, ఎందుకు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సరదాగా ఎవరైనా ఏం చేసినా, అది అనవసరంగా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అలా వైరల్ అయిన పాట ‘జిమ్ జిమ్ తార’. ఒక పల్లెటూరి గాయని సరదాగా పాడిన పాట యూట్యూబ్ సహా ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ సృష్టించింది. అయితే అనూహ్యంగా ఈరోజు ఆమె పాడిన పాట తమ సినిమా కోసం రికార్డు చేయబడిందని చెబుతూ, ‘పర్ణశాల’ అనే సినిమా టీమ్ అనౌన్స్‌మెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తమ కోసం రెండు నెలల క్రితమే ఆమె పాడి రికార్డు చేశారని, ఇప్పుడు అనుకోకుండా సోషల్ మీడియాలో పాడిన పాట వైరల్ అయిందని, ఒక రకంగా అది తమ పాట లీక్ అయినట్లేనని ఆ యూనిట్ పేర్కొంది. ఆ పాట లీక్ అయి ఇంత వైరల్ కావడం ఆనందం కలిగిస్తోందని, తమ సినిమాకి మంచి బజ్ దొరికినట్లు అనిపిస్తోందని ఆ సినిమా నిర్మాత కూడా చెప్పుకొచ్చారు.
అయితే, ఇక్కడ ఈ విషయం మీద పలు ఆసక్తికరమైన కథనాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అదేంటంటే, నిజంగా ఈ సినిమా టీమ్ ముందే పాడించి పెట్టుకుంటే, ఆ పాటని ఆమె అనుకోకుండా సోషల్ మీడియాలో పాడిందా? లేక పాట వైరల్ అయింది కదా అని ఆమెను మేనేజ్ చేసి ఆ పాట కొనుగోలు చేశారా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఈ పాట వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో తనను ‘జబర్దస్త్’కి లేదా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి తీసుకోవాలంటూ ఆయా టీమ్స్‌కి విజ్ఞప్తులు చేస్తూ వీడియోలు రిలీజ్ చేసింది. నిజంగా పాటలు పాడి ఉన్న గాయని అయితే, ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీకి లేదా జబర్దస్త్‌కి వస్తానని ఎందుకు విజ్ఞప్తులు చేస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయం మీద సినిమా టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గానే ఒక లేఖ రిలీజ్ చేసింది. మరి ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది వేచి చూడాల్సి ఉంది.