
Mohammad Kaif: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాల వల్ల యువ ఆటగాళ్ల జీవితాలు, కెరీర్లు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నప్పటికీ, జట్టు బలహీనతలు బయటపడటంతో పాటు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని తన యూట్యూబ్ ఛానెల్‌లో విమర్శించారు. మూడో వన్డేలో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడాన్ని తప్పుబట్టిన కైఫ్, యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వకపోవడమే ప్రధాన సమస్య అని చెప్పారు. రెండో వన్డే ద్వారా అరంగేట్రం చేసిన యువ పేసర్ అకీబ్ నబీ (8.5 ఓవర్లలో 84 పరుగులు)కి ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చి వెంటనే పక్కనపెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. అతని స్థానంలో వచ్చిన అన్షుల్ కాంబోజ్ (10 ఓవర్లలో 82 పరుగులు) కూడా పరుగులు ఇచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఒక మ్యాచ్ చూసి పక్కనపెడితే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, సరైన బ్యాకప్ బౌలర్లు లేకపోవడం మున్ముందు పెద్ద నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.
అలాగే నితీష్ రెడ్డికి ఒక్క మ్యాచ్‌లోనే కొత్త బంతి ఇచ్చి ఆ తర్వాత ప్లాన్ మార్చేయడం, స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులతో ఇబ్బంది పడటం జట్టు ప్రణాళికారాహిత్యాన్ని చూపుతున్నాయన్నారు. ఈ పరిస్థితులు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు నష్టం చేకూరుస్తున్నాయని, ప్రపంచకప్‌కు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అనుభవం లేని బౌలింగ్ దళంతో గిల్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. కోహ్లీ, రోహిత్, గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడం సాధారణ విషయమని, దానివల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. కుల్దీప్ యాదవ్‌కు గతంలో తగిన అవకాశాలు ఇవ్వలేదని, ఈ సిరీస్ వల్ల ఉన్నవాడు ధనవంతుడవ్వడం, లేనివాడు పేదవాడవ్వడం లాంటి పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. ఏ రకంగా చూసినా ఈ సిరీస్ నుంచి భారత్‌కు ఒక్క సానుకూల అంశం కూడా లభించలేదని కైఫ్ స్పష్టం చేశారు.