
హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కరీంనగర్ జోన్ పరిధిలో మొత్తం 3,533 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. రీజియన్ల వారీగా ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.
అదేవిధంగా హైదరాబాద్ జోన్ నుంచి 2,155 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. వీటిలో మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440 ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మరో 1,312 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేసింది. ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. తిరుగు ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 25, 26 తేదీల్లో కూడా తగిన ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ (నల్ల చెరువు), ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు.
రద్దీ ఉన్న రూట్లకు ఖాళీ బస్సుల తరలింపు
తిరుగు ప్రయాణంలో కొన్ని స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ లేకపోయినా, రద్దీ ఉన్న ఇతర రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఖాళీ బస్సులను త్వరితగతిన వెనక్కి తెప్పించి అవసరమైన మార్గాల్లో నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఆయా రూట్లకు తరలించనుంది.
స్పెషల్ బస్సులకు 1.5 రెట్లు వరకు చార్జీలు
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం 2003లో జారీ చేసిన జీవో నంబర్ 16 ద్వారా సంస్థకు కల్పించింది.ఈ నిబంధనల ప్రకారం పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో 1.5 రెట్లు వరకు టికెట్ చార్జీలను సవరించుకునే అవకాశం సంస్థకు ఉంది. ఉమ్మడి ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుంచి ప్రతి ప్రధాన పండుగ సందర్భంగా ఈ విధానం అమలవుతోందని, టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతోందని సంస్థ తెలిపింది.
►ALSO READ | నీళ్లను, విద్యుత్ ను పొదుపగా వాడుకోవాలి..ఎల్‌నినో ప్రభావంపై మంత్రి వివేక్
ఈ దసరా సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 రెట్లు వరకు సవరించిన చార్జీలను అమలు చేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ సవరించిన చార్జీలు వర్తిస్తాయి.ఈ నెల 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 25, 26 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే కొనసాగుతాయని టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరాకు నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్
టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు సంస్థ వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లో సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ కోరింది.