Reading Time: 2 minutes

బూతులు మాట్లాడితే 500 రూపాయలు ఫైన్ : దేశంలో ఫస్ట్ గ్రామం ఇదే..!

Caption of Image.

ఈ మధ్య గ్రామాల పరిస్థితి ఎలా తయారైందో గమనిస్తున్నారా..? గంజాయి, సిగరెట్లు, మద్యం మత్తుకు బానిసైన కుర్రకారు, మాకేం తక్కువ అని యువకులు, పెద్దలు.. నలుగురు ఒక చోట చేరితే జుగుప్సాకరమైన బూతులు, వికారమైన అల్లరి.. ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వెవడ్రా చెప్పనీకె అంటూ.. అ నుంచి ఱ వరకు తిట్ల దండకాలు. కొన్నిసార్లు డైరెక్టుగా తిట్టకుండా కుక్కపైనో, కోడిపైనో పెట్టి తిట్టే ఆకతాయిలు. ఇలాంటి సీన్స్ చూసి చాలా మంది ఏం చేస్తుంటారు.. ఎవడి పాపం వాళ్లకే అని చూసీచూడనట్లు వెళ్లిపోతుంటారు కదా. కానీ ఆ గ్రామంలో అలా ఊరుకోలేదు. నోరు తెరిస్తే పారే మురుగును అరికట్టాలనుకున్నారు. అందుకోసం వినూత్న ఆలోచన చేశారు. అదేంటో చదవండి. 

అది మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లాలో ఉన్న బొర్సార్ గ్రామం. జిల్లా నుంచి 20 కి.మీ. దూరంలో ఉండే ఆ గ్రామంలో 6 వేల మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామంలో ఎవరైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందే. నాలుక జారారో ఫైన్ కట్టడం లేదా వీధులు ఊడ్చటం కచ్చితమైన శిక్ష. ఒకరిని టార్గెట్ చేసి తిట్టినా.. లేదా ఎవరిని టార్గెట్ చేయకుండా తన వరకు కోపంలో ఏదో తిట్టుకున్నా అక్కడ నేరం. దీనికి 500 రూపాయల జరిమానా లేదా ఏ ఏరియాలో తిట్టారో అదే ఏరియాలో ఒక గంట సేపు చీపురు పట్టి వీధులు ఊడ్చడం.

చిన్న ఆలోచన.. పెద్ద మార్పు :

ఆలోచనలేవైనా చిన్నగానే మొదలవుతాయి. దాని ఫలితం మాత్రం ఎంతో మార్పు తీసుకువస్తుంటుంది. ముంబైలో చిన్న చిన్న క్యారెక్టర్స్ తో నటుడిగా పనిచేసి.. పదేళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన అశ్విన్ పాటిల్ అనే వ్యక్తి తెచ్చిన ప్రతిపాదన ఇది.  తల్లి లాంటి నా పల్లె.. అంటూ తన ఊరు గురించి ఎన్నో కలలు కంటూ పల్లె ఒడికి చేరుకున్న పాటిల్.. 12-13 ఏండ్ల పిల్లలు మాట్లాడే భాష చూసి వెగటు పుట్టిందట. పచ్చని చేనుకు తెగులు పట్టినట్లుగా పిల్లలు ఇలా తయారయ్యాని.. తెగులును నివారిస్తేనే పైరు బాగుంటుందని బావించి.. ఈ ప్రతిపాదన తీసుకొచ్చారట. 

పిల్లలు నోరు తెరిస్తే అమ్మ, అక్క.. అంటూ బూతులు మాట్లాడుతున్నారని.. దీన్ని నివారించాలంటే.. సన్మార్గంలో నడిచేలా చేయాలంటే కొన్ని కఠిన నిబంధనలు అవసరం అని అశ్విన్ పాటిల్ గ్రామ పెద్దలకు చెప్పాడు. పాటిల్ ఆలోచనను గ్రామ సర్పంచ్ అంతార్ సింగ్, ఉప సర్పంచ్ వినోద్ శిండే ఇంప్లిమెంట్ చేశారు. ఊర్లో ఎవరైనా బూతులు మాట్లాడింతే 500 ఫైన్ లేదా రోడ్లు ఊడ్చాలి అనే నిబంధనతో ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నారు. 

మాటలే కాదు.. చేతల్లో కూడా..

ఊర్లో బూతులు మాట్లాడొద్దని ఏదో ప్రకటన చేసి ఊరుకోలేదు. చేతల్లో కూడా చేసి చూపించారు. ముందుగా గ్రామంలో మౌఖిక ప్రచారం చేయించారు. ఆ తర్వాత పోస్టర్లు తీసి వీధి వీధిన అంటించారు. దీంతో పాటు గ్రామస్తులందరితో ప్రమాణం చేయించారు. గ్రామస్తులు మాట్లాడే భాషను గమనించేందుకు 20 మంది వార్డు సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా అందరూ గుమిగూడే ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో చిన్న నుంచి పెద్దల వరకు ఆచి తూచి మాట్లాడటం అలవాటు చేసుకున్నారు.

క్లీన్ టంగ్ నుంచి క్లీన్ విలేజ్ వరకు..

క్లీన్ టంగ్ ఆలోచన నుంచి గ్రామంలో సమూల మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. బూతులు మాట్లాడటం మానేయటమే కాకుండా. గ్రామంలో క్లీనింగ్ డ్రైవ్ లు ఏర్పాటు చేశారు. అందరూ గ్రామ శుభ్రతలో పాలుపంచుకకున్నారు. అదే విధంగా గ్రామంలో ప్రధాన కూడళ్ల దగ్గర క్యూ ఆర్ ఆదారంగా ఫ్రీ వైఫై సదుపాయం కూడా కల్పించారు. అదే విధంగా దేవాలయాల స్పీకర్లలో ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు జాతీయ గీతాన్ని ప్లే చేయడం కూడా చేస్తున్నారు. జాతీయ గీతం వచ్చినప్పుడు పనులు వదిలిపెట్టి గ్రామస్తులు గౌరవంగా నిలబడతారట.

అదే విధంగా అక్కడ సేవా రూమ్ అనే ఒక కొత్త ఆలోచన చేశారు. అవసరం లేని వస్తువులను  ఆ సేవా రూమ్ దగ్గర ఇస్తే అవసరం ఉన్న వాళ్ల ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకుంటుంటారు. అందుకే ఒక్క ఆలోచన.. మరెన్నో మంచి మార్పులకు నాంది పలుకుతుందని తమ గ్రామం నిరూపించినట్లు బొర్సార్ గ్రామ సర్పంచ్ చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.