
ప్రశ్న: మా ఇల్లు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. రెండు రూములను మేం వాడుకుంటూ. ఒక గదిని అద్దెకి ఇచ్చాం. అయితే మా పిల్లలు చదువుకునేందుకని పైన ఒక గది కట్టాలనుకుంటున్నాం. అసలు సమస్య ఇక్కడే వచ్చింది, ఓపెన్ టెర్రస్ ఎటువైపు ఉండాలి? అలాగే ఇప్పుడు నైరుతిలో ఉన్న వాటర్ ట్యాంక్ ని ఎక్కడికి మార్చాలో అర్థం కావట్లేదు. ఎలా చేస్తే,వాస్తు దోషాలు తగలకుండా ఉంటుందో చెప్పండి..
జవాబు: ఇంటిపైన ఓపెన్ టెర్రస్ ఎప్పుడూ ఉత్తరం, తూర్పు దిక్కుల్లోనే ఉండాలి. అదే అన్ని విధాలా మంచిది. అలాగే రోడ్డు ఏ దిక్కున ఉన్నా సరే.. టెర్రస్ మాత్రం రెండువైపులా ఉండేలా చూసుకోవాలి. మరో విషయం మీరు ఇప్పటివరకు ఓవర్హెడ్ వాటర్ ‘ట్యాంకును నైరుతి మూల పెట్టామన్నారు. చాలామంది చేస్తున్న తప్పు అదే. అక్కడ ఎందుకు పెడుతున్నారని ఎవరినైనా అడిగితే, నైరుతి మూల బరువు ఉండాలి కదా అంటున్నారు. అగ్ని, నీరు ఎప్పుడూ నైరుతిలో ఉండకూడదు. మీరు ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకును మధ్య పడమర లేదా వాయువ్యంలోకి మార్చుకోండి.
మాస్టర్ బెడ్ రూమ్ ఏ వైపు ఉండాలి?
ప్రశ్న: మొన్నటివరకూ హైదరాబాద్ లో అద్దెకు ఉండేవాళ్లం. ఇప్పుడు నగరశివార్లలో కట్టిన ఇంటినే కొనుగోలు చేశాం. అందులో రెండు బెడ్రూములున్నాయి. ఒకటి నైరుతిలో, మరొకటి వాయువ్యంలో ఉంది. అయితే దేన్ని మాస్టర్ బెడ్రూమ్ వాడుకోవాలి? ఏది పిల్లలకు ఇవ్వాలి? మా బెడ్ రూమ్లు రెండూ వాస్తు ప్రకారమే ఉన్నాయా? వాస్తు దోషాలు తగలకుండా ఉండేందుకు సలహాలు ఇవ్వండి.
జవాబు: మీరు కొన్న ఇంట్లో బెడ్రూములు రెండూ వాస్తు ప్రకారం సరిగ్గానే ఉన్నాయి. అయితే నైరుతిలో ఉన్న బెడ్రూమ్ ను మాస్టర్ బెడ్రూమ్ గా వాడుకోవాలి. అలాగే వాయువ్యంలో ఉన్నదాన్ని పిల్లలకు ఇవ్వొచ్చు. అది ఆడపిల్లలైనా. మగపిల్లలైనా…. ఇద్దరికీ ఆ రూమ్ బాగానే ఉంటుంది.
ఈశాన్యం మూల తగ్గొచ్చా?
ప్రశ్న: కొన్ని రోజులుగా మేం స్థలం కొనాలనుకుంటున్నాం. మొన్నీ మధ్య నూటా ఇరవై గజాల స్థలం చూశాం. ఆ ఏరియా చాలా బాగుంది. మెయిన్ రోడ్డు, షాపులకు దగ్గరగా ఉంది. ధర కూడా మా బడ్జెట్ లోనే ఉంది. కాకపోతే, వచ్చిన చిక్కల్లా ఆ ప్లాట్ కి ఈశాన్యం మూల కొంచెం తగ్గింది. అయితే పడమర రోడ్డుకు ఉన్న ప్లాట్ కాబట్టి, ఈశాన్యం మూల తగ్గితే ఆ ఇంట్లో వాళ్లకి మంచిది కాదంటున్నారు. మరికొందరు పర్వా లేదంటున్నారు? ఆ ప్లాట్ మేం కొనాలా వద్దా చెప్పండి.
జవాబు: ఒక్క పడమర రోడ్డుకు ఉన్న ప్లాటే కాదు… ఏ రోడ్డుకు ఉన్న స్థలానికైనా ఈశాన్యం మూల తగ్గకూడదు. వేరే మూల కొంచెం తగ్గినా అటుఇటుగా పనికొస్తుంది. కొన్ని మార్పులు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఈశాన్యం మూల మాత్రం అసలు తగ్గొద్దు. తగ్గితే మాత్రం కచ్చితంగా వాస్తు దోషాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ స్థలాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. ఎలాగూ కొన్నిరోజులుగా తిరుగుతున్నాం అంటున్నారు. ఇంకాస్తంత ఓపిక పట్టి మంచి స్థలాన్ని కొనుక్కోవడం మంచిది.
కాశీనాథుని శ్రీనివాస్,
వాస్తు కన్సల్టెంట్: 94400 88799
== వెలుగు లైఫ్