
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సెంచరీ క్రాస్ చేసిన క్రూడాయిల్ ధరలు మంగళవారం (ఏప్రిల్ 7) అర గంటలోనే ఏకంగా ఐదు డాలర్లు పెరిగింది. క్రూడ్ ధరలు అమాంతం 5 డాలర్లు పెరగడానికి ప్రధాన కారణంగా మంగళవారం (ఏప్రిల్ 7) అంతర్జాతీయంగా చోటు చేసుకున్న రెండు సంఘటనలే. అవేంటంటే.. ఇరాన్‌కు కీలకమైన చమురు రవాణా కేంద్రమైన ఖార్గ్ ద్వీపంపై మంగళవారం అమెరికా భీకర దాడులు చేయడం ఒకటి.
ఆ తర్వాత హార్మూజ్ జల సంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ట్రంప్ ఆ దేశానికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం ఇంకొకటి. ‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది” అని ట్రంప్ ఘాటు హెచ్చరికలు చేశాడు. ఈ రెండు పరిణామాల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒకేసారి 5 డాలర్లు పెరిగింది.
మంగళవారం (ఏప్రిల్ 7) ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 110 డాలర్లుగా ఉంది. ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి, ఇరాన్ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ తర్వాత బెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లకు పెరిగింది. ఈ ప్రభావం గల్ఫ్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయా దేశాల్లో పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
ట్రంప్ ఫైనల్ వార్నింగ్:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే.. ఏం జరుగుతుందో చెప్పేశాడు. ట్రంప్ మాటల్లోనే.. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇరాన్ దేశాన్ని మళ్లీ పున:నిర్మించలేరు. అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అయినా అదే జరుగుతుంది అంటూ ట్రూత్ పోస్టులో తన స్టాంగ్ ఏంటో స్పష్టంగా చెప్పారు ట్రంప్.
హర్మూజ్ ఓపెన్ కాకపోతే.. ఈ రాత్రికి ఇరాన్ దేశంలో నాగరికత అంతం అవుతుంది అంటూ ఫైనల్ గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఇరాన్ పాలనలో ఇప్పుడు మార్పు వచ్చింది. భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువగా ఉన్న మనుషులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైనది ఏమైనా జరగొచ్చు.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కామెంట్ చేశారు ట్రంప్.
ఖార్గ్ ద్వీపంపై అమెరికా భీకర దాడులు:
: ఓ వైపు శాంతి చర్చలు అంటూనే అమెరికా బరి తెగించింది. ఇరాన్ గుండె లాంటిదైనా ఖార్గ్ ద్వీపంపై భీకర దాడులతో విరుచుకుపడింది అమెరికా. పబ్లిక్ సెక్టార్లపై దాడులు చేయొద్దని యుద్ధ నిబంధనలు ఉల్లంఘించి మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించడంతో ఖార్గ్ ద్వీపం అగ్ని గోళంగా మారింది. ఆకాశాన్నంటేలా భారీగా మంటలు చెలరేగాయి. ఖార్గ్ ద్వీపంపై దాడుల్లో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా పాల్గొంది.
ఖార్గ్ ద్వీపంపై దాడులను ఇరాన్ మీడియా సంస్థ మెహర్ న్యూస్ ధృవీకరించింది. మంగళవారం (ఏప్రిల్ 7) తెల్లవారుజామున ద్వీపంలో భారీ పేలుడు సంభవించినట్లు నివేదించింది. ఈ దాడుల శబ్దాలు ద్వీపం అంతటా వినిపించాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ దాడుల్లో ఖార్గ్ ద్వీపంలోని రాడార్ స్టేషన్, డాక్ సౌకర్యాలు, పలు సైనిక స్థావరాలతో సహా కీలకమైన ప్రదేశాలు దెబ్బతిన్నట్లు తెలిపింది.
ఖార్గ్ ద్వీపం ఇరాన్‌కు కీలక చమురు ఎగుమతి కేంద్రం. ఇరాన్ చమురు రవాణా దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. ఖార్గ్ ద్వీపంలో 30 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును నిల్వ చేసే మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఆర్ధిక వ్యవస్థకు ఖార్గ్ ద్వీపం గుండె కాయవంటింది. ఇరాన్ కు ప్రధాన ఆదాయ వనరైన ఖార్గ్ ద్వీపంపై దాడులు చేసి ఆ దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీయాలనే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడులకు ఒడిగట్టాయి.