Reading Time: 2 minutes

OTT Telugu: జెన్‌జీని ఊపేసిన బోల్డ్ రొమాంటిక్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అర్జున్ రెడ్డి’ తరహా సీన్స్

Caption of Image.

ఈ ఏడాది ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా చిత్రం ‘నిలవే’ (Nilave). ఇప్పుడు ఈ జెన్‌ జీ లవ్ స్టోరీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. సాయి కే వెన్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో కొత్త కుర్రాడు సౌమిత్ పోలాడి హీరోగా నటించాడు. శ్రేయాసి సేన్ హీరోయిన్‌‌‌‌.

జెన్‌ జీ ఆడియన్స్‌ను లక్ష్యంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రం, అర్జున్ రెడ్డి తరహా ఇంటెన్స్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు IMDbలో 8.4 రేటింగ్ లభించడం గమనార్హం.

ఈ సందర్భంగా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తరువాత, ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 9 నుంచి ఈటీవీ విన్ వేదికగా ‘నిలవే’ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. “ఓ కలలా.. ఓ జ్ఞాపకంలా.. నిలవే! ప్రేమ, విరహం, అందమైన ఎమోషన్లతో కూడిన కథ. ఏప్రిల్ 9న కేవలం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్” అని ప్రకటించింది.

కథేంటంటే..

అర్జున్ (సౌమిత్ రావు) ఒక ప్రతిభావంతుడైన అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. వృత్తిపరంగా సక్సెస్ ఉన్నప్పటికీ, అనాథ అయిన అర్జున్ జీవితంలో ఒంటరితనం అతడిని నీడలా వెంటాడుతుంటుంది. తనకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుందని పరితపించే అర్జున్, చివరికి డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

సరిగ్గా తాను తనువు చాలించాలనుకుంటున్న క్షణంలో, ఎదురు అపార్ట్‌మెంట్‌లో అతనికి ‘అతిథి’ (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. ఆమెను చూడగానే అర్జున్ మళ్ళీ జీవితంపై ఆశ పెంచుకుంటాడు. అతిథితో పరిచయం కాస్తా సాన్నిహిత్యానికి దారితీస్తుంది. వీరిద్దరూ శారీరకంగా కూడా దగ్గరవుతారు. కానీ, అర్జున్ తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు అతిథి దానిని అంగీకరించదు.

అసలు అతిథి తన ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏమిటి? పెళ్లి, పిల్లలు, ఒక అందమైన కుటుంబం ఉండాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? ఈ కథలోకి శాంతను అనే పాత్ర ఎందుకు వచ్చింది? చివరకు వీరిద్దరి ప్రయాణం ఎటు వైపు సాగింది? అన్నదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే:

ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సన్నివేశాలతో ఆహ్లాదకరంగా సాగుతుంది. ‘అర్జున్ రెడ్డి’ తరహాలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ, అవి కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప అసభ్యంగా లేవు. ఇక సెకండాఫ్‌లో సినిమా అసలు రంగు బయటపడుతుంది. హీరోయిన్ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు గుండెకాయ లాంటిది. ఒక అమ్మాయి ఎందుకు ఒంటరిగా ఉండాలనుకుంటుంది అనే కోణాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించారు. క్లైమాక్స్ మెప్పిస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.