
ఏ వివాదాల జోలికి పోకుండా.. ద్రవిడ్ లాగే కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు.. అనుకునే రహానే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. తనపై వచ్చిన కామెంట్స్ పై స్పందించిన తీరు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రహానే అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఇప్పటికే పలువురు సీనియర్లు చురకలంటించిన వేళ.. టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
గురువారం (ఏప్రిల్ 02) ఈడెన్ గార్డెన్స్‌లో సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే చేసిన కామెంట్సే.. ఇప్పుడు ఇంత చర్చకు దారి తీశాయి. 227 టార్గెట్ ఛేజింగ్‌లో రహానె 10 బాల్స్‌లో 8 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. 2020 నుంచి నా స్ట్రయిక్ రేట్ బాగానే ఉంది. దీనిపై విమర్శలు చేసే వారు బహుశా నా ఆటను చూడటం లేదనుకుంటా. లేదంటే నేనంటే గిట్టనివారు అయి ఉండాలి. నేను ఆడటం వాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు. నామీద అసూయతో ఒక ప్లాన్ ప్రకారం దాడి చేస్తుండవచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రహానే కామెంట్స్ పై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు. రహానే అలా అని ఉండాల్సింది కాదు అన్నాడు. రహానే ఫీలింగ్ అర్థం చేసుకోగలను. అయితే బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ విషయంలో కొందరు పొగుడుతుంటారు.. కొందరు విమర్శిస్తుంటారు. కానీ నువ్వు రెండింటి విషయంలో న్యూట్రల్ గా ఉండటం నేర్చుకోవాలి. ఇలాంటి వివాదాలకు ఎంటర్ కావాల్సిన అవసరం ఏముంది అని మండిపడ్డాడు.
విమర్శల విషయంలో సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు సెహ్వాగ్. తమ పర్ఫామెన్స్ పై వచ్చే విమర్శల విషయంలో ఆచితూచి మాట్లాడేవారని.. కొన్నిసార్లు వాటికి రెస్పాండ్ కాకుండా ఉండేవారని చెప్పాడు. అమితాబ్ ఒక్క విమర్శపైన కూడా స్పందించేవాడు కాదు. సచిన్ విషయంలో కెరీర్ స్ట్రగుల్ లో ఉన్నపుడు.. టెండూల్కర్ కు బదులు ఎండూల్కర్ (Endulkar).. అని ఒక న్యూస్ పేపర్ రాసింది. అప్పుడు కూడా ఓర్పుతో ఉన్నాడే కానీ.. ఆయన రెస్పాండ్ కాలేదని చెప్పుకొచ్చాడు.
ముందు సైలెంట్ గా ఉండటం నేర్చుకో. వీలైతే ఓ సెంచరీ చెయ్.. అందరి నోళ్లూ మూతపడతాయి. కామ్ గా ఉంటూ నీ పని నువ్వు చేసుకుపో.. ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా.. అంటూ సలహా ఇచ్చాడు సెహ్వాగ్.