Reading Time: 2 minutes

IPL 2026: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్.. ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీ క్యాన్సిల్!

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది బాధితులకు నివాళిగా, ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేస్తున్నట్లు సమాచారం. 2025, జూన్ 4వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో భారీ జనసందోహం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది గాయపడ్డారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు ఎలాంటి ఆడంబరాలు ఉండవని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చి చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటూ, వారి జ్ఞాపకార్థం ఎటువంటి సెలబ్రిషన్స్ లేకుండానే టోర్నీని ప్రారంభించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రారంభ వేడుకలను రద్దు చేసినప్పటికీ, మే 31న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ రోజున గ్రాండ్ క్లోజింగ్ సెర్మనీని నిర్వహించాలని గవర్నింగ్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు. 

కాగా సంప్రదాయంగా వస్తున్న ఐపీఎల్ వేడుకల కంటే ప్రజల భద్రతకే అధిక ప్రాధాన్యతనిస్తూ, 19వ సీజన్‌ను సైలెంట్ గా ప్రారంభించభోతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు. ఈ నిర్ణయం క్రీడాభిమానుల్లో కొంత నిరాశ కలిగించినా, బాధితుల పట్ల బీసీసీఐ చూపిస్తున్న మానవత్వాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరగనున్న హోరా హోరీ పోరుపైనే ఉంది.

©️ VIL Media Pvt Ltd.