Reading Time: < 1 minute
Lpg Cylinder Black Marketing Ranga Reddy Raid 2026

రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ముఠాల పట్ల జిల్లా సివిల్ సప్లై అధికారి (DSO) వనజాతా రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల భద్రతను పణంగా పెట్టి అక్రమ వ్యాపారం సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.

రాజేంద్రనగర్ పరిధిలో భారీ తనిఖీలు..
బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ కాళీ మందిర్ సమీపంలో పౌరసరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సామాన్య ప్రజలకు అందాల్సిన డొమెస్టిక్ (గృహ) సిలిండర్ల నుంచి గ్యాస్‌ను అక్రమంగా చిన్న సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్లలోకి రీ-ఫిల్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ దాడుల్లో భారీ ఎత్తున సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 104 డొమెస్టిక్ (గృహ అవసరాల) సిలిండర్లు, 58 కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్లు, 50 చిన్న (5 కేజీల) సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:Holidays: మార్చి 20న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

డొమెస్టిక్ సిలిండర్ల ధర తక్కువగా ఉండటంతో… వాటిని అక్రమంగా సేకరించి, అధిక ధరలకు విక్రయించే చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను మారుస్తూ లక్షల రూపాయల లాభాలు గడిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని, జనవాసాల మధ్య ఇలాంటి పనులు చేయడం వల్ల పేలుళ్లు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వనజాతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

‘అక్రమ వ్యాపారుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన ప్రజలకు అవసరం లేదు. గ్యాస్ సరఫరా సజావుగానే ఉంది’ అని ఆమె హామీ ఇచ్చారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, వారిని జైలుకు పంపడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని ఆమె హెచ్చరించారు.