Reading Time: 2 minutes

స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, మిత్రదేశాలని కూడా చూడకుండా సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ వైఖరి ఇప్పుడు శత్రుదేశాలను కూడా ఒకతాటిపైకి తీసుకువస్తోంది. వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూ, అమెరికా సుంకాల కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసుకునేందుకు ఆయా దేశాధినేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా భారత్- కెనడాల మధ్య యురేనియం ఒప్పందం ఈ క్రమంలో కుదిరినదనే చెప్పాలి. భారత్‌కు కెనడా శత్రుదేశం కాకపోయినా మొన్నటివరకూ ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో పుణ్యమాని ఇరుదేశాల మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నాయి. కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని ఆరోపించడమే కాదు, తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం ఉందంటూ, దానిపై ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని సైతం ఏర్పాటు చేశారు. దీంతో ఉభయదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునేంత స్థాయికి పరిస్థితి దిగజారింది. అయితే, ట్రూడో స్థానంలో గత ఏడాది మార్క్ కార్నే ప్రధాని పదవిని చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. తమ దేశంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక కార్యకలాపాల వెనుక భారత్ హస్తం లేదంటూ ఆయన చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య తిరిగి స్నేహసౌరభాలు గుబాళించేందుకు బాటలు వేసింది.

కార్నే భారత్ పర్యటనకు ముందు కెనడా ప్రభుత్వం సైతం తమ దేశ ఎన్నికల్లో భారత్ ప్రమేయం లేదని తాము విశ్వసిస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలు దూదిపింజల్లా తేలిపోయాయి. రెండు దేశాలూ అమెరికా సుంకాల బారిన పడినవే కావడంతో పరస్పర సహాయ సహకారాలతో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనకు వచ్చిన కార్నే కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత్ పౌర అణు విద్యుత్ అవసరాల కోసం 2.6 బిలియన్ డాలర్ల యురేనియాన్ని సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఏటా 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వచ్చే తొమ్మిదేళ్లలో 50 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. చిన్న, మాడ్యులర్ తరహా అణు రియాక్టర్ల సరఫరా, పునరుత్పాద రంగాల్లోనూ పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకారం కుదిరింది. ఇవన్నీ శీఘ్రగతిన అమలయ్యేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఉభయ దేశాలు ప్రతిపాదించాయి. తాజా ఒప్పందాలలో కీలకమైనది యురేనియం సరఫరాయే. అణు విద్యుదుత్పత్తికి ఊతమివ్వాలన్న భారత్ ఆశయానికి ఈ ఒప్పందం ఎంతో కీలకమైనది. ప్రస్తుతం ఉన్న 6.78 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడం భారత్ లక్ష్యం. దేశీయంగా చిన్న, మాడ్యులర్ తరహా అణు రియాక్టర్ల అభివృద్ధికి ఇటీవల బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించిన భారత్, ఆ దిశగా వేసిన ముందడుగుగా కెనడాతో ఒప్పందాన్ని చూడాలి.

తాజా ఒప్పందాలతో ఒకవైపు భారత్ లో అణు విద్యుదుత్పత్తి పుంజుకుంటే మరోవైపు కెనడాకు ఈ ఒప్పందం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమైనది. అక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఊపందుకుంటాయి. తాజా ఒప్పందం మేరకు కెనడాలోని ప్రముఖ మైనింగ్ కంపెనీ కేమ్కో వచ్చే సంవత్సరంనుంచి తొమ్మిదేళ్లపాటు యురేనియంను భారత్‌కు సరఫరా చేస్తుంది. భారత్‌తో కలసి పనిచేయడం కేమ్కోకు ఇది కొత్త కాదు. గతంలో ఐదేళ్లపాటు ఈ సంస్థ భారత్‌కు యురేనియంను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అణు విద్యుత్తు రంగంలోనే కాకుండా కృత్రిమ మేధ, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య అవగాహన కుదరడం ఆహ్వానించదగిన పరిణామం. కెనడా విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఈ ఒప్పందం భారతీయ విద్యార్థులకు ఉపయోగకరం. భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందంటూ గుడ్లురుముతున్న అమెరికాతో భారత్ ఒకవైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ క్రమంలో రెండు నెలల క్రితం యురోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఒక మైలురాయి కాగా, కెనడాతో కుదిరిన తాజా ఒప్పందం మరొకటి. కెనడా ప్రధాని కార్నే అన్నట్లుగా ఈ ఒప్పందం ఒక ‘లాండ్ మార్క్’ గా నిలిచి, ఇరు దేశాలకూ ప్రయోజనకారి కావాలని ఆశిద్దాం.