Reading Time: 2 minutes

కోల్‌కతా: టి20 ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్‌కు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం మొదటి సెమీస్ జరుగనుంది. లీగ్ దశలో కివీస్‌పై విజయం సాధించిన కిందటి రన్నరప్ సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. న్యూజిలాండ్ గ్రూప్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ముందుకు సాగాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా అసాధారణ ఆటతో చెలరేగి పోతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే సెమీస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్, భారత్, వెస్టిండీస్, అఫ్గాన్ వంటి జట్లను ఓడించింది.

సూపర్8లో పటిష్టమైన టీమిండియాను చిత్తుగా ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో తొలి సెమీస్ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే 268 పరుగులు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రియాన్ రికెల్టన్ కూడా జోరుమీదున్నాడు. డికాక్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే మిల్లర్, బ్రెవిస్, స్టబ్స్ చెలరేగితే కివీస్ బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. దీంతో పాటు ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. బోస్చ్, రబడా, ఎంగిడి, జాన్సన్, మహారాజ్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. రెండు విభాగాల్లో చాలా పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడకుండానే సెమీస్‌కు వచ్చిన సఫారీ టీమ్ ఈసారి కూడా జోరును కొనసాగించి ఫైనల్‌కు చేరుకోవాలనే లక్షంతో ఉంది.

ప్రతీకారం కోసం..

మరోవైపు న్యూజిలాండ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, మార్క్ చాప్‌మన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఓపెనర్లు సిఫర్ట్, అలెన్‌లు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఫిలిప్స్, రవీంద్ర కూడా కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకుంటున్నారు. కెప్టెన్ సాంట్నర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, నీశమ్, సోధి తదితరులతో కివీస్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లు ఉండడంతో తొలి సెమీస్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..