Reading Time: 3 minutes

ప్రపంచంలో అన్నివృత్తుల కన్నా గౌరవించదగిన, ఆదర్శవంతమైన, అవినీతి లేని వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ప్రపంచంలోని అనేకదేశాలలో ఉపాధ్యాయులకు అన్నివృత్తుల వారి కన్నా ఎక్కువ వేతనాలు ఉంటాయి. జపాన్‌లో డాక్టర్‌ల కన్నా ఇంజినీర్ల కన్నా ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనాలు ఉంటాయి. డాక్టర్లు, ఇంజినీర్లు ఆ దేశ ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అంటే మిమ్మల్ని తయారు చేసిన వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకుంటారా? అని అడిగారట. అదే విధంగా అనేక దేశాలలో ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం, ఉన్నత వేతనాలతో సమాజంలో గౌరవం దక్కుతుంది. మన పొరుగు రాష్టమైన ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. మన దేశ భవిష్యత్తు కాకుండా ప్రపంచ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంది. కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ పాఠాలు, యూట్యూబ్, కృత్రిమమేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఐ) లను అభివృద్ధి చేసింది ఉపాధ్యాయులే అన్నది మరవలేని మరపురాని నిజం.

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన నివేదికలో ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనాలు ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వడం ఉపాధ్యాయ లోకంలో గందరగోళం, అయోమయం, ఆవేదన, ఆందోళన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో దినమంతా విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన నివేదిక మీద చర్చలు జరిగాయి. ఉపాధ్యాయులుగా చేయడం వృత్తి కాదు నిపుణులను తయారు చేసే సేవ అని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అంటున్నారు. దేశంలో అందరూ మర్యాదఇచ్చే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయులుగా జీతం జీవితం గురించి కాకుండా అన్ని రకాల వృత్తులను తయారు చేసే నైపుణ్యంగల వృత్తి. ఉపాధ్యాయులను గౌరవించడం తరతరాలుగా ఉంది. విదేశాల్లో కోర్టులలో అందరినీ నిలబెట్టి సాక్ష్యం తీసుకుంటారు. కానీ ఉపాధ్యాయులను గౌరవించి వారికి చైర్ వేసి కూర్చోబెడతారు. విదేశాల్లో అందరి కంటే ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలో ఉత్త టీచర్స్‌లను ఎంపిక చేసి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొని రావొద్దు. ఎప్పుడూ పాఠశాలలకు వెళ్ళని వాళ్ళకు, ఉపాధ్యాయ సంఘాలలో తిరిగేవారిని, అధికారుల చుట్టూ తిరిగే వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి నిజంగా పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్న వారిని, వినూత్న పద్ధతులలో బోధిస్తూ విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేవారిని ఎంపిక చేయాలి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పకుండా అధికారులే నిజమైన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేస్తే ఎంతో బాగుంటుంది. 35, 38 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా చేసి ఎంతోమందిని పదవ తరగతిలో ఉత్తీర్ణులను చేసి 2026 2027 విద్యా సంవత్సరంలో పలవీ విరమణ చేసేవారిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రులు పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించే సంప్రదాయం ఉండేది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సెప్టెంబర్ 5 నాడు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి రాకుండా ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నాయకులను నిరాశ, నిస్పృహలకు గురి చేసేవారు. 2025 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాలువా, మెమెంటో, నగదుతో సన్మానించి ఉపాధ్యాయులపట్ల అభిమానం చాటారు. ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 5 నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శిల్పారామంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొని దీర్ఘకాలంగా అపరిషృతంగా ఉన్న సమస్యల పరిష్కారం చేస్తానని ప్రకటించారు. ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలైన నగదు రహిత హెల్త్ కార్డు లు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్, డైట్, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సిఇఆర్‌టి), బి.ఎడ్, ఐసిఎస్‌సిలలో రెండు దశాబ్దాలుగా ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ, ఆచార్య పోస్టుల భర్తీ, విశ్వవిద్యాలయాలలో ఆచార్య పోస్టుల భర్తీ మొదలైన ఉపాధ్యాయ సమస్యలకు ఉపాధ్యాయ దినోత్సవం నాడు పరిష్కారం అవుతుంది అనే నమ్మకం కలిగించారు.

ఎన్నో సంవత్సరాలనుండి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, పదోన్నతులు, బదిలీలు చేసి ఉపాధ్యాయుల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నానని ఉత్తమ ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, పాఠశాల విద్య శాఖాధికారుల మధ్య చాటారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ విద్యా శాఖ కమిషన్ నివేదికలో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులను తయారు చేసే డిఎడ్ లేకుండా బిఎడ్ చేయాలని అనడం ఎంత వరకు సమంజసం. ఎంతోమంది ఉపాధ్యాయ శిక్షణ చేసుకొని నిరుద్యోగ ఉపాధ్యాయులుగా టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్(టెట్) ఉత్తీర్ణత సాధించి డిఎస్‌సి కోసం ఎదురు చూస్తున్న వారికి విద్యా కమిషన్ నివేదిక గుండె గుబులు మన్నది. బిఎడ్ చేసిన వారికంటే డిఎడ్ చేసిన వారే ప్రాథమిక పాఠశాలల్లో బోధించాలని, ప్రాథమిక పాఠశాలల్లో బిఎడ్ చేసిన వారిని ఎంపిక చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాకమీషన్ సుప్రీం కోర్టు తీర్పు ఒక్క సారి పరిశీలించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అనడంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. పెండింగ్‌లో ఉన్న ఐదు డిఎలు, పిఆర్‌సిలను వీలైనంత వరకు త్వరలో ప్రకటించాలి. ఉపాధ్యాయుల వేతనాల కంటే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘా ల నాయకులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విద్యా శాఖ, తెలంగాణ విద్యా కమిషన్ ఉపాధ్యాయుల వేతనాలు మిగితా దేశాల కంటే మిగితా రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి.

ఎస్. విజయ భాస్కర్

92908 26988