
శంకర్ పామర్తి నాకు ఆర్టిస్ట్ మోహన్ వల్ల పరిచయమయ్యాడు. గతంలో సాదాసీదా డ్రాయింగ్ మాస్టర్ ఆయన. ఒకానొక సమయంలో ఈశ్వరుడు శంకర్ కలలో కనిపించి ఇకపై హృదయవిదారకమైన డ్రాయింగ్ టీచర్ వృత్తి మానుకుని మంచి ఆర్టిస్ గా ఎదిగి నానా తిప్పలూ పడమని శాపం వంటి దీవెన ఇచ్చాడు. ఫలితంగా మోహన్ గారి గదిలో చుర్రుమని ఎండ మండిపోతున్న వేళ ఓ మారుమూల కిక్కురుమనకుండా బొమ్మలు వేస్తూ నాకు దర్శనమిచ్చాడు. ఇదంతా ఇప్పటి మాట కాదు.
పై పేరాలో వివరించిన విధంగా శంకర్ చాలా కాలం కార్టూన్లు వేయడం, మోహన్ బొమ్మల్ని ‘ఇం కు చెయ్యడం’ అవిశ్రాంతంగా చేశాడు. మోహన్ దగ్గరకు వచ్చే అనేక ఆర్టు బుక్సులోని బొమ్మల్ని కళ్లతో అప్పగించేంత పనికి దిగేడు. అలాగే, మోహన్ గారికి తన కళ్ళూ, చెవులూ శ్రద్ధగా అప్పగించి సువిశాలమైన చిత్రకళ, దాని చరిత్ర, పెయింగ్‌లో నేటి విచిత్ర గతి వరకు అనేక విషయాలు వినడం, వీలయినంత అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. బొమ్మలు గీయడమే ముఖ్యంగా భావించి శరీరాన్ని తీగవలె వంచి బొమ్మలు వెయ్యడంలో ‘ఎరేజర్’లాగా అరిగి తరిగిపోవడం చూశాడు. కాబట్టి శంకర్ భవిష్యత్తులో ఏమవుతాడో నాకు స్పష్టంగా కనిపించింది. తరచూ మోహన్ని కలిసి వెళ్లే ఎందరికో శంకర్ బొమ్మల తాపత్రయం అలాగే, వేళ్లు వంకర్లు పోయేంతగా బొమ్మలు గీయడంలో మునిగిపోయి వచ్చిపోయే వారిని అతను గమనించకపోవడమూ కనిపించేది. ఇందుకు మోహన్ మిత్రులందరూ ప్రత్యక్ష సాక్షులన్నమాట!
అలా తలమునకలయ్యే తాదాత్మం ఒక విచిత్ర స్వర్గం.. ఈ కారణంగానే పత్రికల్లో కేవలం కా ర్టూనిస్టుగా సెటిలయిపోకుండా ‘మంచిలైన్’ అం టే ఏమిటి, అసలు సిసలు కేరికేచర్ పరమ రహస్యం ఏమిటి అనే ప్రశ్నలు తన మీద తానే సంధించుకు ని గీతల గజ ఈతగాడయ్యాడు చూస్తుండగానే. సాధారణంగా కార్టూన్ అంటే అర్థం పర్థం లేని వంకర టింకర ఆకారాలేవో గీసి వదిలించుకుంటే చాలని అధికుల అభిప్రాయం. పైగా థర్డ్ రేటెడ్ ద ద్దమ్మ సినిమా డైలాగ్ లాంటి బుద్ధిహీనమైన ‘జోకు’ని ‘క్యాప్షన్’గా భావించే జనం కూడా ఉండనే ఉంటారు కదా! ఇలా పలువురికి గల దురభిప్రాయాన్ని బాగు చేయడం ఏ ఆర్టిస్ట్ జేజమ్మ చేయలేని పని! సరే బాపులాంటి ఓ ముగ్గురు తప్ప ‘కార్టూన్’ అనే పదార్థానికి ఓ ‘అనాటమీ’ ప్రత్యేకించి వుంటున్న స్పృహ ప్రచారం చేయబోయి హేమాహేమీలయిన పెద్ద కార్టూనిస్టులే బొక్కబోర్లాపడ్డారు. ఇవన్నీ శంకర్ శత్రుత్వాన్ని గమనించే గూ ఢచారి లాగా గమనించలేకపోలేదు. శృతి లయ లు కార్టూన్‌కి, కేరికేచర్‌కి ఉంటాయన్న సద్వివేచన కలిగినవాడై కాగితాలపై ‘ప్రాక్టీసు’తో విజృంభించాడు.
గీతల్లో ధారని, వాటి వేగంలో సౌందర్యాన్ని సత్వరమే సందర్శించాడు. నిజానికి కేరిచర్ అనగా ఆర్టిస్టు కుర్రకారుకి ఓ ‘సత్వర బట్వాడా’ పద్ధతి ఉంది. అదేమంటే ఎవరిదో ఒక వెర్రి ముఖం వేసి, దానికి పోలియో వచ్చిన పీత కాళ్లు రెండు తగిలిస్తే చాలన్న దారుణ విన్యాసమన్నమాట. ఇవి చూసి, విసిగి శంకర్, కేరికేచర్ గీయడం అనే వండర్‌లాండ్‌లో ఘోర తపస్సు చేశాడు. తన బుద్ధి, మనసు, ఏకాగ్రత పెట్టి ఏకలవ్యుడు వగైరా పెద్దల వలె చెట్టు కొమ్మన పిట్ట కన్ను మాత్రమే చూడటం విలు విద్యకే కాదు. కేరికేచర్ గీయడానికి అత్యవసరం అని, బాగా ఆరితేరి తెలుసుకన్నాడు. ఇలాంటి సర్వావస్థలు పడి, లేచి, నిలిచి బాపు, మోహన్, చంద్ర, గోపి, రాజుల నుంచి విదేశాల్లో ‘బిడిక్’ల వంటి శూరాధిశూరులను మెప్పించాడు. కేరికేచర్ పై తెలుగు మాట్లాడే ప్రజలకు కొత్త ముచ్చటపెట్టాడు ‘శంకరన్న’.
పై వ్యవహారమంతా అక్కడితో ఆగలేదు. మన రచయితలు, కవులు, ఇతర మేధావులు, చిత్రకళాకారులయిన వీరాధివీరులు ఇలా అందర్ని వరుసపెట్టి కేరికేచర్లు గీశారు. పెయింటింగ్స్ లాగా వేశాడు. పటం కట్టి ప్రదర్శన పెట్టాడు. కళ గురించి కొద్దోగొప్పో ప్రవేశం ఉన్న ప్రతి ఆర్టిస్ట్ క్రిటిక్కూ వాటిని చూసి సంబరపడ్డారు. కేరికేచర్‌ను ఆనందించే రుచి తెలీని ఆర్టిస్టులు సైతం కొందరు పెదవి విరిచి, మూతి ముడిచి చిరాకు, కంగారూ కూడా బాగా పడ్డారు. అంతబాగా బొమ్మలు వేసిన శంకర్ కొత్త మలుపున నిలిచాడని అందరు హర్షించారు. జాబితా చేయలేము. కొన్ని గీతలకు రంగులు తాకించి, మనకు ప్రశస్తమైన చిరునవ్వు తెప్పించే ‘వేళాకోళం’ ప్రక్రియ ‘కేరికేచర్’ అని అనుకునే కొంతమందికి సోయి లేదు, తట్టుకోలేరు. అందుకే ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో కేరికేచర్‌ను ఎడంగా పెట్టినవారు ఉన్నారు గనుక, శంకర్ తన కేరికేచర్లను పైస్థాయి పెయింటింగ్ దశకు లాగి సాధించి పెట్టాడు. మాకే పరువు ఉండదన్న దన్నుతో కేరికేచర్ ప్రయాణంలో స్వైయిర విహారం చూపెడుతుందన్నాడు.
దేశవిదేశీ క్రీడాకారులు, కళాకారులు, జెండా, అజెండాకారులు, ఇతరత్రా మహమహులయినా స్త్రీ, పురుషులు యావన్మందిని కేరికేచర్ని చూసి పైవిధంగా శంకర్ చేసిన దేశ, విదేశీ పర్యటనలు, అవార్డులు, పేపర్లలో హోరు, ఏవీ శంకర్ను తాకలేదు. మీసాలు, మెలేసి, పడగొడతానంటూ తొడగొట్టే ప్రక్రియ దిగనీయలేదు. అతని సద్భావం, సదాశయం, జోకునకు ఔటు పేలినట్టు నవ్వడం, మంచి మాటలకు మతాబులా వెలగటం ఏదీ తగ్గలేదు. కేరికేచర్ను శాలువా కప్పి సత్కరించి, దాని విలువ కొత్తతరం తెలుగువారిని అవతలివారిని గట్టిగా పరిచయం చేసుకున్నాడు. అదేపనిగా పెట్టుకుని, కలర్ పెన్సిల్, ఇంక్ పెన్, క్రొక్విల్, చార్కోల్ రంగులద్దిన బ్రెష్ వంటి సకలాయుధాలు సమకూర్చకుని శంకర్ తన స్టూడియోలో చేస్తున్న చిత్ర యాగం వెళ్లి చూస్తే తెలుస్తుంది. వాటి మెరుపు మూసిన కిటికీల అవతల కూడా మెరవడం కనిపిస్తుంది. మెరుపునకు కారణం కేరికేచర్లలో జిగి వీటిలో ఒక మార్పు, ఒక డిజైన్, ఒక మోతిఫ్, అల్లిక వంటి నిర్మాణం ఫ్రేములు దాటిపోయి విస్తరిస్తున్నట్టనిపించే తీరు బహు సొగసు కదా. ఇదంతా చూస్తున్న శంకర్ కుమారుడు ‘కన్నతండ్రి అని కూడా చూడకుండా’ అతని స్థాయికి వచ్చేసున్నాడొచ్చేస్తున్నాడు. శంకర్ ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బెంగుళూరుల్లో ఆయనకు మహాభిమానులున్నారు. ఆ ప్రాంతాల్లో శంకర్ బొమ్మల ప్రదర్శన బహుబాగా జరిగిందనడానికి ఈ అభిమానం ఒక ఉదాహరణ. ‘నెట్’ ద్వారా శంకర్ లాంటివాడే నల్లొండ నుంచీ నెదర్లాండ్స్ దాకా ఉన్నారు.
పనితనం చూపిస్తే పరిగెట్టుకురారా మరి! పనితనంలో పసగల నేర్పు, కూర్పు, మార్పుల నగిషీలతో పాటు శంకర్ ఎంచుకున్న ‘సబ్జెక్టు’లు కూడా మీరు గమనించే ఉంటారు. అవి గాంధీజీ, మేక కేరికేచర్‌కు (చిత్ర కళలో) సింబల్స్ వంటి ఈ రెండు రకాలను ఒక శిల్పం స్థాయిలోకి, స్థిరంగా ధీమాగా నిలిచేలా చేసుకుపోతున్నారు. అసంఖ్యాకంగానే చెట్టుమీద పిట్ట వాలినంత హాయిగా కనిస్తున్నాయి ఈ ‘ఇమేజ్’లు. చెప్పలేనన్ని కోణాల్లో అవి పలకరిస్తాయి. అని శంకర్ అంటాడు. అన్నట్టే అనేసి వేసేస్తున్నాడు. మేక అనగానే గ్రామీణ జీవితానికి సింబల్. నగరాల్లో ఆహారానికి ఒక అమాయక ప్రాణి సింబల్! శంకర్‌కి పిట్టల కంటే మేకల మీద ప్రేమ, కరుణ వగైరాలు, మేక అనే జీవిని సనసన్నటి పట్టుదారాల్లాటి గీతల్లో అల్లుకపోతాయి. ‘ఫ్రేమింగ్’తో సహా అన్ని అరుదైన అందాన్నిస్తున్నాయ. మీరు చూసే ఉంటారు. అనేక ప్రదర్శనల్లో వీటి గౌరవం, గిరాకీ పెరిగిందని వేరే చెప్పాల్సింది లేదు. దంతపు భరణి మీద డిజైన్లా, కేలిగ్రాఫ్లా, నేతపనిలా కనిపించే ఈ బొమ్మలు నేలరాతకు మంచి అలంకారంలా కూడా అనిపిస్తాయి.
ఇక గాంధీజీ.. నాడు ఫొటోగ్రాఫర్లకు, కార్టూనిస్టులకు, కేరికేచరిస్టుకలు బహు ఇష్టుడాయన. ఆయనే ఓ మారు అన్నారు. ‘మై పిక్చర్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్ మిస్చిఫ్’ బోసి నవ్వు గుహలో ప్రతిధ్వనించినట్టు! గాంధీజీ గనుక గాడ్సేను తప్పించుకున్నట్టయితే తిన్నగా శంకర్ ఇంటికి విచ్చేసి తన కేరికేచర్లను పట్టకుపోయేవారనిస్తుంది. (గాంధీజికి బొమ్మల సంగతి తెలుసు కదా) వందల వందల అద్భతాలు శంకర్ గీసిన గాంధీలు.. చిరస్మరణీయులవుతాయవి.. ఏం స్ట్రోకులు అవి, బాపురే! ఒకనాడు అబూ అబ్రహం, ఆబంధు, నాటి శంకర్, రంగాగార్లు జిలేబీ.. చుట్టల్లాగా గాంధీజీ బొమ్మలు గీసి పడేస్తే, విదేశీ ఆర్టిస్టులు బ్రిటీష్, అమెరికన్ పత్రికలు నిండేలా గీస్తే ‘ఔరా’ అనుకున్నాము.. ఇవాళ శంకర్ గీస్తున్నవి చూస్తే గాంధీజీ ‘భలే మిస్సయ్యారు వీటిని చూడకుండా అని నాకయితే అనిపిస్తుంది. మేకలు, గాంధీలు.. మరిన్ని దేశ, విదేశీ గేలరీల్లో అచ్చులో పులకరించాలి. తెలుగు జెండా ఇంకా ఎగరాలి. ఆర్టిస్టులకు, అనార్టిస్టులకు బొమ్మలపై అనురాగం పెరగాలి. శంకర్‌కు అనేక పెద్ద అవార్డులు బోలెడు బాకీపడి ఉన్నాయనిపిస్తోంది నాకయితే.
– శివాజీ తల్లావజ్జుల