
ప్రసేన్ అనే నేను అదేపనిగా పదాలకు అర్ధాల కోసం కాక అర్ధాలకు పదాలను వెతకడం వెనుక చదవడం, రాయడం అనే గందరగోళం బోలెడంత ఉంది. తిట్లూ, దీవెనలూ సమఉజ్జీలుగానే ఉన్నాయి. నా సాహితీ ప్రయాణం ఓ రోలర్ కోస్టర్ రైడ్. ఎగుడు దిగుళ్ల ఎత్తుపల్లాలతో నాకు నేను ఇచ్చుకున్న ఆటోగ్రాఫ్. అద్భుతమైన వాక్యం ప్రసేన్‌ది అన్నారు. అర్ధం కాని కవిత్వం ప్రసేన్‌ది అని కూడా అన్నారు. అన్నీ ఒకలాగే కుంగకుండా, పొంగకుండా స్వీకరించాను. కవిత్వం మనసును రంజింపచేయడం కాదు ఒక తాత్విక అవగాహనను కల్పించాలి అన్నదే నా భావజాల టాగ్ లైన్. ‘దాదాపు పాతికేళ్ళ క్రితం మహానుభావుడు వేగుం ట ఎందుకన్నాడో గానీ ప్రసేన్ తన సమకాలీన కవులకంటే రూపం విషయంలో వందేళ్లు ముందున్నా డు అని నాకు గొప్ప ప్రశంసగా మేకులు దింపేసా డు. కె.శ్రీనివాస్ ఎక్కడో రాసిన విమర్శకుల విమర్శలతో కవులు, రచయితలు ప్రిజుడిస్ అవుతారు అన్న వాక్యార్థం నన్ను అప్రమేయంగా వేగుంట ప్రశంసలోకి ప్రిజుడిస్ చేసేసింది. అదంతా ఓ ప్రహసనం.
దానికి ముందు ఎప్పుడు మొదలయిందో తెలియ దు రాత వ్యసనం. చదవడం వల్ల కావచ్చు. చదివే వ్యసనం ఎప్పుడు మొదలయిందో మాత్రం తెలు సు. పుట్టింది 1960లో. అమ్మానాన్నా చదువరులు కావడం వల్ల కావచ్చు. ఇంట్లో అన్ని రకాల పుస్తకాలుండడం వల్ల కావచ్చు. 1974 ప్రాంతంలోనే చదవడం అలవాటయింది. ఆ అలవాటు ఆ పై 50 ఏళ్ళపాటు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏ పుస్తకమైనా మొదలు పెడితే ముగిసే వరకూ వదలక పోవడం నా దురలవాటు. అది పుస్తకం కావచ్చు వెబ్ సిరీసే కావచ్చు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ మెదలుకుని డెబోనెయిర్ దాకా, సినిమా మాగజైన్ లు మొదలుకుని క్రీడా పత్రికలదాకా చదవడం వ్యసనంగా ఉండేది. టి.చంద్రశేఖర రెడ్డి, ఏవి శాస్త్రి, ఎవి రమణమూర్తి లాంటి వాళ్ల సాంగత్యం సీరియస్ సాహి త్యం వైపులాగింది. అప్పుడే సీరియస్ గా కొకు, త్రిపుర, వడ్డెర చండీదాస్, చలం, కారా, మో, శేషేంద్ర లాంటి వారు ఇంకా అ లాంటివారే చాలా మంది ఆవహించారు. సీరియస్ సాహిత్యచర్చలు రాయడం వైపు మళ్లించాయి. సీతారాంతో కలిసి కొన్ని కథలూ రాసాను.
ఈ చదవడం, రాయడం అనే ప్రక్రియలే 1984లో ఉదయంలో సహసంపాదక ఉద్యోగాన్నిచ్చాయి. అ క్కడినుంచి 2020 వరకూ జర్నలిస్టుగానే. 1983 లో అఫ్సర్ సీతారాంతో కలిసి రక్తస్పర్శ, 1995లో ఇంకా ఉంది. 2001లో ఏదీ కాదు, 1991లో మ రో ఐదుగురు కవులతో కలిసి క్రితం తర్వాత, అదే 1991లో మరో ముగ్గురు కవులతో కలిసి గద్దరూ, రాజ్యమూ. మనమూ దీర్ఘ కవిత, 2006లో ప్రసేన్ సర్వస్వం, 2009లో అదే ప్రసేన్ సర్వస్వం పునర్ముద్రణ, 2018లో క్షమ కావ్యం పోయెట్రీ ఆల్బం, 2021లో ఎవరికి వర్తిస్తే వారికి కవిత్వ సంపుటి, 2021లోనే సిక్టీ పూర్తి వ్యాసాల సంపుటి, 2021లోనే టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ కవిత్వ ఆంగ్ల అనునువాద సంపుటి, 2023లో ప్రసేన్ ఎట్ సినిమా, ఇవీ ఇప్పటివరకూ పుస్తకరూప ఆస్తులు. సాహిత్య విమర్శా వ్యాసాల సంపుటి ప్రస్తుతం ఇన్ ప్రెస్.
‘నియమాలను ఉల్లంఘించి దారి తప్పడమే నా నడక. ఆకాశంలో పక్షికే మో గానీ నాకైతే పాదముద్రలుంటాయి అస్పష్టంగానో అదృశ్యంగా నో. ఓ ప్రయత్నంగా పూలనిచ్చా ను పరిమళాన్నిచ్చాను. భావజాలాన్నిచ్చాననే అనుకుంటున్నాను. చైతన్యాన్నిచ్చాననే అనుకుంటున్నాను. నివురునై దాచి నిప్పునై దాక్కుని కొత్తనై కుమిలి పాతనై విసిగి డిజ్ ఓన్ చేసుకున్న రక్తస్పర్శ నుంచి ఎవరికి వర్తిస్తే వారికి దాకా మలుపులు మజిలీల వెతుకులాటల అగమ్యాల నాలుగున్నర దశాబ్దాల ప్రయాణ ఉపోద్ఘాత మూ, ఉపసంహారమూ ఇదే. అం దుకే నాది కవిత్వం అనలేదు. భావ వ్యాకరణం అన్నాను. అవును, ‘నాది స్వభావ వ్యాకరణం’ అని తరచూ చెపుతుంటాను. నా నేపథ్యంలోకి తొంగిచూసుకుంటూ నేనెవరికైనా చెప్పేదొకటే. చదవాలి చదవాలి చదవాలి చదవాలి. ఇప్పుడు రాస్తున్నవాళ్లకు లేని అలవాటిది. అచ్చయిన ఏ ముక్కయినా చదవాలి. చెత్తా చెదారం ఏదైనా చదవడమంటూ జరిగితే ఉత్తమ పఠనం వైపు అదే తీసుకెళుతుంది. చదవడం అనే వ్యసనమే మంచి పఠనం, చెడ్డ పఠనాల మధ్య తేడాకు అర్దం చెపుతుంది. అది తెలుసుకోగలిగితే చాలు.