Reading Time: 2 minutes

 45 ఏళ్ల తర్వాత పెద్దపల్లికి రాక కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపులు

మన తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి: 45 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ రావు సొంత గూటికి చేరుకున్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి మల్లోజుల భార్య తారతో కలిసి వచ్చారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1980లో సొంత ఊరిని కుటుంబ సభ్యులను విడిచి ఉద్యమ బాట ఎంచుకుని మల్లోజుల వేణుగోపాలరావు అడవిబాట పట్టాడు. ఉద్యమ ప్రస్థానంలో అంచలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగారు. ఇటీవల మల్లోజుల లొంగిపోయిన సంగతి విధితమే. సుదీర్ఘ విరామానంతరం మల్లోజుల స్వగ్రామానికి రావడం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో చర్చనీయాంశమైంది.

సోదరుడికి పరామర్శ..

పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య -మధురమ్మకు మూడో సంతానం వేణుగోపాల్ రావు. సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ పిలుపుతో 1980లో అడవి బాటపట్టారు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్న మల్లోజుల గతేడాది అక్టోబర్‌లో తన 45 ఏళ్ల సాయుధ ఉద్యమ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో తన సహచరులు 60 మందితో లొంగిపోయారు. ఆ తర్వాత మల్లోజుల ఒక్కసారి స్వగ్రామానికి రావాలని ఆయనతో అనుబంధం ఉన్నవారు పిలుపునిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయన గ్రామంలో అడుగుపెట్టలేదు. అయితే తన సోదరుడు అంజన్న అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం తెలుసుకుని ఆదివారం మల్లోజుల పెద్దపల్లిలోని తన సోదరుడిని పరామర్శించేందుకు వచ్చారు. సుదీర్ఘకాలం తమకు దూరంగా ఉంటున్న మల్లోజులను చూసి ఆయన కుటుంబసభ్యులు, పరిచయస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో ఫోటోలు దిగారు.

అయితే 2022లో మల్లోజుల వేణుగోపాల్ తల్లి మల్లోజుల మధురమ్మ (96) మరణించారు. ఆ సమయంలో తల్లి అంత్యక్రియలకు సైతం మల్లోజుల హాజరుకాలేదు. ఆ తర్వాత అమ్మా నన్ను మన్నించు అంటూ అజ్ఞాతం నుంచి భావోద్వేగ లేఖను విడుదల చేశారు. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చిన నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత తన స్వగ్రామానికి వచ్చి తన పాత సృ్మతులు గుర్తు చేసుకున్నారు. అక్కడ తన బంధువులతో ఆత్మీయులను కలుసుకున్నారు. తన స్నేహితులు, గ్రామస్థులతో ముచ్చటించారు. ఇంత కాలం దండకారణ్యంలో ఉన్న మల్లోజుల గ్రామానికి రావడంతో ఆయనను చూసేందుకు పరిచయస్థులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అందరిని మల్లోజుల సరదాగా పలకరించి మాట్లాడారు. వారితో తనకున్న పాతజ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు.

పోలీసుల నిఘా..

మల్లోజుల స్వగ్రామ పర్యటన మొత్తం పోలీసుల కనుసన్నల్లోనే సాగిందని చెప్పాలి. ఆయన వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసులు మల్లోజుల కదలికలను సునిశితంగా పరిశీలిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు మల్లోజుల నిరాకరించారు.