Reading Time: < 1 minute

గతుకులు గతుకులుగా వున్న

ఈ రాళ్ల వంతెన మీద, నీ శక్తినంతా కూడగట్టి

బలంగా బాదుతూనే వుండు

అటువైపు ఎల్లాలంటే, నువ్వు చెయ్యాల్సింది ఇదే

చెమట చుక్కలు ఆగకుండా

రాలిపడుతూనే వుంటాయి, అలసిపోకు

నెత్తిమీద సూరీడు సురుక్కు సురుక్కున

పొడుస్తూనే వుంటాడు, సేదతీరకు

అడుగులేయ వీలుకాని ఈ అసంబద్ద దారిలో

ఒకానొక అక్రమ గెలుపు

సాఫిగా గుర్రమెక్కి పోతది

ఆశ్చర్యపోకు చూస్తూ ఊరుకోకు

రక్తం సల సల మరగనీ

రెక్కలు ముక్కలు చేసుకునైనా

ఈ కాంక్రీటు మొనల మధ్య

కాసింత మెత్తటి మట్టిని పరువు

ఒడిదొడుకుల ఈ దారిపొంట

తడబడుతూ ఎంతకాలం నడుస్తావ్

మోసాల కింద నలుగుతున్న బతుకుల్ని చూస్తూ

కాలం కుత కుత ఉడికి

దొర్లి పోతాంటది పోనీకు మర్లపడు

చైతన్యం ముందు సాగిల బడ్తతి, గుర్తుపెట్టుకో

రహదారెంట నువ్వు దర్జాగానే నడవాల

రాబోయెటొళ్లకు సక్కటి దారిని సూపాల

ఇంకెందుకు ఆలస్యం

ఉక్కు సంకల్పాన్ని పిడికిళ్ల మధ్య బిగించి

కొట్టు దిమ్మీస

– డా.కటుకోఝ్వల రమేష్