Reading Time: < 1 minute

పరిశ్రమల్లో విషవాయువుల తగ్గింపునకు.. రూ.3వేల590 కోట్ల పెట్టుబడులు

Caption of Image.
  • సీఐఐ సమిట్​లో ప్రకటించిన కంపెనీలు

న్యూఢిల్లీ: పరిశ్రమల్లో విషవాయువులను తగ్గించడం, విద్యుదీకరణ, వేస్ట్​హీట్​  రికవరీ, డిజిటలైజేషన్ కోసం రూ.3,590 కోట్ల పెట్టుబడులు పెడతామని హైదరాబాద్​లో జరిగిన 25వ సీఐఐ ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్​లో కంపెనీలు ప్రకటించాయి.   సీఐఐ, బీఈఈ ఈ సందర్భంగా ఇండియా హీట్ పంప్ అట్లాస్ ఆవిష్కరించాయి. ఇందులో 288 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2,201 హీట్ పంప్ ప్రాజెక్టుల వివరాలను చేర్చారు.  

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ కృష్ణచంద్ర మాట్లాడుతూ, పెరుగుతున్న ఇంధన డిమాండ్‌‌‌‌ను తట్టుకోవడానికి ఇంధన సామర్థ్యం పెంపు, విద్యుదీకరణ చాలా అవసరమని చెప్పారు. 2070 నాటికి నెట్ జీరో, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాల సాధన కోసం తమ సంస్థ అమలు చేస్తున్న అడిటీ పథకం ఎంఎస్ఎంఈలకు అండగా నిలుస్తుందని తెలిపారు. 

సదస్సు చైర్మన్ తేజ్ ప్రీత్ సింగ్ చోప్రా మాట్లాడుతూ,  జీడీపీలో 30 శాతానికి పైగా, ఎగుమతుల్లో దాదాపు 50 శాతం వాటా ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఏఐతో ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గత మూడేళ్లలో 720 పరిశ్రమలు రూ.5,700 కోట్ల వ్యయంతో రూ.7,100 కోట్లు ఆదా చేశాయని సీఐఐ ప్రతినిధి కిరణ్ అనంత పేర్కొన్నారు.

 ఎంఎస్ఎంఈల గ్రీనింగ్‌‌‌‌కు సరికొత్త పోర్టల్

 ఈ సమిట్​లో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ) డీకార్బనైజేషన్‌‌‌‌పై కీలక సదస్సు జరిగింది. టెక్నాలజీ, ఆర్థిక సహకారంతో ఇంధనాన్ని పొదుపు చేయడం, క్లీన్‌‌‌‌టెక్ విధానాలను వేగవంతం చేయడంపై నిపుణులు చర్చించారు.  ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ మార్కెట్‌‌‌‌ప్లేస్ పోర్టల్‌‌‌‌ను ప్రారంభించారు. 

దీంతో చిన్న పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయి. ఫ్యాక్టరీ స్థాయిలో ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ఇంధన సామర్థ్యం, నాణ్యత పెరుగుతాయని సమ్మిట్ చైర్మన్ తేజ్‌‌‌‌ప్రీత్ సింగ్ చోప్రా తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.