Reading Time: 2 minutes
Tata Sons Chandrasekaran Reappointed For 5 Years Noel Tata Opposes

Noel Tata vs Chandrasekaran: పారిశ్రామిక వర్గాలతో పాటు.. సాధారణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు మెజారిటీతో నిర్ణయించింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలకు అనుగుణంగా టాటా సన్స్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఈ రెండు నిర్ణయాలపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్ పునర్నియామక ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక డైరెక్టర్ నోయెల్ టాటానే అని పలు నివేదికలు పేర్కొన్నాయి. మిగిలిన ఐదుగురు డైరెక్టర్లు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయానికి తుది ఆమోదం టాటా సన్స్ షేర్‌హోల్డర్ల సమావేశంలో రావాల్సి ఉంది. టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉంది.

చంద్రశేఖరన్ ముందుగా ఏమన్నారు?
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ఫిబ్రవరి 2027లో ముగిసిపోనుంది.. 2026 ఆగస్టు 12న ఆయన ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యాక మరోసారి చైర్మన్‌గా కొనసాగేందుకు తనను తాను ప్రతిపాదించుకోబోనని బోర్డుకు తెలియజేశారు. అనంతరం సెప్టెంబర్ 3న టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సమావేశమై, ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. బోర్డు విజ్ఞప్తిని చంద్రశేఖరన్ అంగీకరించడంతో సెప్టెంబర్ 17న ఆయనకు మరో ఐదేళ్ల పదవీకాలాన్ని మెజారిటీ ఓటుతో ఆమోదించినట్టు అయ్యింది..

నోయెల్ టాటా మాత్రమే ఎందుకు వ్యతిరేకించారు?
అయితే, నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చగా మారింది.. అసలు ఆయన అభ్యంతరానికి ప్రధానంగా నాయకత్వ మార్పు, బోర్డు నిర్ణయ ప్రక్రియ, టాటా సన్స్ నిబంధనలపై ఉన్న విభేదాలు కారణంగా నివేదికలు పేర్కొంటున్నాయి. టాటా ట్రస్ట్స్ వైపు నుంచి, చంద్రశేఖరన్ ఇప్పటికే పదవీకాలం అనంతరం కొనసాగబోనని తెలియజేసినందున కొత్త వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని వాదన వచ్చింది. అదే సమయంలో టాటా ట్రస్ట్స్, చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానం చట్టబద్ధతపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రస్ట్స్ పేర్కొన్న న్యాయపరమైన అభిప్రాయం ప్రకారం, టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని వాదించింది. దీనిపై బోర్డు నిర్ణయం, ట్రస్ట్స్ అభ్యంతరాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

టాటా సన్స్ IPO ఎందుకు తెరపైకి వచ్చింది?
మరోవైపు.. టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలనే నిర్ణయానికి RBI నిబంధనలు కీలక కారణంగా నిలిచాయి. టాటా సన్స్ ఉన్నత శ్రేణి NBFCగా ఉన్న నేపథ్యంలో వర్తించే నిబంధనల ప్రకారం లిస్టింగ్ అంశం ముందుకు వచ్చింది. కంపెనీ తన NBFC రిజిస్ట్రేషన్‌ను వదులుకునేందుకు చేసిన ప్రయత్నం తర్వాత RBIతో నియంత్రణపరమైన అంశాలు కొనసాగాయి. తాజా బోర్డు నిర్ణయంలో RBI మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే నోయెల్ టాటా మాత్రం RBI నుంచి వచ్చిన కమ్యూనికేషన్‌లో లిస్టింగ్‌పై స్పష్టమైన ఆదేశం లేదని పేర్కొంటూ, గత రెండున్నరేళ్లుగా RBIతో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది..

టాటా సన్స్‌లో వాటాల పరిస్థితి
టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు 18.37 శాతం వాటా ఉండగా, టాటా గ్రూప్‌కు చెందిన కొన్ని ప్రధాన కంపెనీలకు కూడా టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయి. అందువల్ల టాటా సన్స్ భవిష్యత్తులో లిస్టింగ్‌కు వెళితే యాజమాన్య నిర్మాణం, షేర్‌హోల్డర్ల ప్రయోజనాలు, కంపెనీ పాలనలో మార్పులు వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ఇక, టాటా సన్స్ లిస్టింగ్ జరిగితే భారీ స్థాయిలో మూలధనం సమీకరించే అవకాశం ఉండటంతో పాటు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ వ్యాపారాలు వంటి కొత్త రంగాల్లో టాటా గ్రూప్ పెట్టుబడులకు కూడా ఇది ప్రాధాన్యమైన అంశంగా మారవచ్చు. అయితే IPO పరిమాణం, విలువ వంటి అంశాలు ఈ దశలో ఖరారు కాలేదు.

టాటా గ్రూప్‌లో చంద్రశేఖరన్ ప్రస్థానం
టాటా గ్రూప్‌తో ఎన్‌. చంద్రశేఖరన్‌కు దాదాపు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది.. టీసీఎస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఆ సంస్థకు CEO, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2017లో తొలిసారిగా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కొనుగోలు, డిజిటల్ వ్యాపారాల విస్తరణ, సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి కొత్త రంగాల్లోకి విస్తరించింది. 2022లో టాటా సన్స్ బోర్డు ఆయనను మరో ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించింది.

ఇక ముందేం జరగనుంది?
ఇప్పుడు.. చంద్రశేఖరన్ పునర్నియామకం, టాటా సన్స్ లిస్టింగ్‌కు సంబంధించిన బోర్డు నిర్ణయాలు ఇప్పుడు తదుపరి కార్పొరేట్ ప్రక్రియలకు వెళ్లనున్నాయి. ముఖ్యంగా టాటా సన్స్ షేర్‌హోల్డర్ల సమావేశంలో ఈ నిర్ణయాలకు ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం. మరోవైపు RBI నిబంధనలకు అనుగుణంగా లిస్టింగ్ ప్రక్రియలో కంపెనీ తీసుకునే తదుపరి చర్యలు కూడా టాటా గ్రూప్ భవిష్యత్ నిర్మాణంపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి.