Reading Time: < 1 minute
Gautam Gambhir On Vaibhav Sooryavanshi T20i Chances And Opportunity

Gautam Gambhir on vaibhav sooryavanshi: భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచన చేశాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో వైభవ్ మరికొంతకాలం తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశాడు.

అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన అభిషేక్.. భారత్‌కు 127 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

అఫ్గానిస్థాన్ సిరీస్‌లో గౌతమ్ గంభీర్ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇద్దరూ అద్భుతంగా రాణించడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా నిలిచారు. దీంతో వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వైభవ్ విషయంలో జట్టు మేనేజ్మెంట్‌తో చర్చ జరిగిందని గంభీర్ తెలిపాడు. “వైభవ్ తన అవకాశం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. అతడి ప్రతిభ, అతడు ఏం చేయగలడో మాకు తెలుసు. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా నిరంతరం రాణిస్తున్న ఆటగాడు.. ఇప్పుడే జట్టులోకి వచ్చిన ఆటగాడి కంటే ముందుంటాడు” అని గంభీర్ పేర్కొన్నాడు.

అయితే వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తామని గంభీర్ స్పష్టం చేశాడు. “అతడికి అవకాశం వచ్చినప్పుడు సుదీర్ఘమైన అవకాశాలు లభిస్తాయి. భారత క్రికెట్ అంటే ఇదే. జట్టులో ప్రతిభ, పోటీ ఉండాలని మేం కోరుకుంటాం. కానీ క్రికెట్‌లో అవకాశం కోసం ఎదురుచూడాల్సిన సందర్భాలు ఉంటాయి” అని చెప్పాడు. వైభవ్ వయసును కూడా ప్రస్తావించిన గంభీర్.. ఆటగాడు 15 ఏళ్ల వాడైనా, 30 ఏళ్ల వాడైనా అవకాశం కోసం వేచి ఉండాల్సి వస్తే తప్పదని అన్నాడు. దీంతో టీ20ల్లో వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడే ఓపెనింగ్ అవకాశం దక్కకపోవచ్చనే సంకేతాలను గంభీర్ ఇచ్చాడు.