Reading Time: 2 minutes

పాకిస్థాన్‌లో లాక్ డౌన్: రాత్రి 9కి షాపులు క్లోజ్.. పెళ్లిళ్లలో ఒక్క వంటకమే వడ్డించాలె!

Caption of Image.

ఆర్థిక సంక్షోభానికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది. పెరుగుతున్న క్రూడ్ ధరలు, సరఫరా సమస్యల కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యుత్, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ క్యాబినెట్ డివిజన్ సెప్టెంబర్ 17న అధికారికంగా కొత్త రూల్స్ విడుదల చేసింది.

పాక్ వ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే వెడ్డింగ్ హాల్స్, ఇతర ఈవెంట్ వేదికలు రాత్రి 10 గంటల కల్లూ బంద్‌ చేయాల్సిందే. ఇక రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్‌లెట్‌లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలని నిబంధన పెట్టారు. అయితే పార్శిల్, హోమ్ డెలివరీ సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. దీనికి తోడు పెళ్లిళ్లలో విందుకు కేవలం ఒక వంటకం మాత్రమే వడ్డించేలా పరిమితి విధించింది పాక్ సర్కార్.

ప్రజలపైనే కాకుండా ప్రభుత్వ వ్యవస్థపైనా ఈ ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రభుత్వ శాఖల అధికారిక వాహనాల ఇంధన కోటాను 3 నెలల పాటు ఏకంగా 50 శాతం మేర తగ్గించారు. ఫెడరల్ డిపార్ట్‌మెంట్లు కొత్త వెహికల్స్ కొనకుండా నిషేధం విధించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరికరాలు మినహా మిగిలిన డ్యూరబుల్ గూడ్స్ కొనుగోళ్లను నిలిపివేశారు. FY2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వేతర ఖర్చులను 5 శాతం తగ్గించాలని ఆదేశించారు. రక్షణ రంగానికి, అత్యవసర సేవలకూ కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ.. పరిపాలనా వాహనాలకు ఇంధన కోత వర్తిస్తుంది. మంత్రులు, పార్లమెంటేరియన్ల విదేశీ పర్యటనలపై 3 నెలల పాటు ఆంక్షలు పెట్టారు. సమావేశాల కోసం టెలికాన్ఫరెన్సింగ్ విధానాన్ని వాడాలని నిర్ణయించింది దాయాది దేశం.

అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన క్రూడ్ రేట్లకు అనుగుణంగా పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను ఎప్పటికప్పుడు సవరిస్తోంది. సెప్టెంబర్ 18 నుండి అమల్లోకి వచ్చేలా పెట్రోల్ ధరను 43 పైసలు తగ్గించి లీటరుకు 390.79కి చేర్చగా, హై-స్పీడ్ డీజిల్ ధరను లీటరుకు 3.47 పెంచి 424.92 పాకిస్థానీ రూపాయలకి చేర్చారు. 

ALSO READ : నెస్లే అమ్ముతున్న బేబీ ఫుడ్స్‌పై FSSAI కేసులు..

మిడిల్ ఈస్ట్ లో చెలరేగిన సంఘర్షణలు, రెడ్ సీ షిప్పింగ్ ప్రమాదాల కారణంగా క్రూడ్ దిగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో సామాన్యులను ఆదుకునేందుకు మోటార్ సైకిల్స్, రిక్షాలు, చిన్న కార్ల యజమానులకు లీటరుకు 100 పాకిస్థానీ రూపాయలు సబ్సిడీని అందించే సరికొత్త టార్గెటెడ్ ఫ్యూయల్-రిలీఫ్ స్కీమ్ షరీఫ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

©️ VIL Media Pvt Ltd.