
Indonesia: ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో సదరు మహిళ విలవిలలాడింది. దయ చూపాలని వేడుకున్న శిక్షను అమలు చేస్తూనే ఉన్నారు. దెబ్బలకు తట్టుకోలేక మహిళ నేలపై కుప్పకూలి స్పృహ కోల్పోయింది.
అచే ప్రావిన్స్ రాజధాని బండా అచేలో సెప్టెంబర్ 17న ఈ ఘటన జరిగింది. షరియా చట్టం ఆధారంగా అమలయ్యే స్థానిక నిబంధనల ప్రకారం వివిధ నేరాలకు పాల్పడిన 11 మందికి శిక్షలు విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పురుషుడు, మహిళకు చెరో 100 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు.
శిక్ష అమలు చేస్తున్న సమయంలో మహిళ తీవ్ర నోప్పితో బాధపడినట్లు స్థానిక కథనాలు తెలిపాయి. చేతులు పైకెత్తి దయచూపాలని వేడుకుంటున్న ఆమె కొద్దిసేపటికే నేలపై కుప్పకూలింది. ఆమెతో పాటు శిక్షకు గురైన వ్యక్తి కూడా 60 దెబ్బలు పూర్తయిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కొంతసేపు శిక్షను నిలిపేశారు. ఆ తర్వాత మళ్లీ కొరడాతో కొడుతూ 100 పూర్తిచేసినట్లు బండా అచే ప్రాసిక్యూటర్ కార్యాలయ సీనియర్ అధికారి దుర్మా ముస్తికా తెలిపారు.
శిక్షను చూసేందుకు భారీగా ప్రజలు..
శిక్ష అమలును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ షరియా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అచే ప్రావిన్సుల్లో షరియా ఆధారంగా శిక్షలు విధిస్తు్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు, మద్యం సేవించడం, జూదం ఆడటం, వివాహం కాని స్త్రీ, పురుషులు సన్నిహితంగా ఉండటం శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు. ఇటీవల వ్యభిచారం కేసుల్లో నలుగురికి 100 కొరడా దెబ్బల్ని విదించారు.