
చంద్రకాంతికి
రాత్రి ముస్తాబయింది
మినుగుర్లు చమ్కీలల్లా
ఏరు పాట ఎత్తుకొని పోతుంది
ఊతలు లేవు మావులు లేవు
ఇసిరే వల లేదు ఏసే గాలం లేదు
భయం లేని చాపలతో
వాగు ఉయ్యాల ఊగుతుంది
బుగ్గ దొమ్మ బుగ్గ మీద దీపం వెలుగుతుంటే
ఒక చాప తన తోకని కుంచెలా చేసి
వలయాలుగ బొమ్మల్ని ఈదుతుంది
పెయ్యి చిక్కమై చిక్కని
పారవశ్యాన్ని దాచుకుంది
కనురెప్పల తీరంలోకి
కొట్టుకొస్తున్న కలలు
రేలపూత రాలి
వెన్నెల్ని చిన్నబుచ్చింది
పొద్దున వాలిపోయిన
పిట్టల గురించి
పాలకంకుల గుసగుస
తాటి జగ్గల్లో గుడ్డి గువ్వ
నిద్రపోతున్నట్టు ఉంది
పిట్ట గుడ్లల్లో ఏదో అలికిడి
పొదలల్లో మెల్లని శ్వాస
దరి మీద తిరుగుతుంటే
దాపరికం లేని లోకమే
ఎన్ని గాయాలకు
నిశ్శబ్దం కట్లు కట్టిందో
కుదుట పడ్డ చెట్టు నీడన
ఓ చల్లని చెయ్యి కనిపించింది
ఒడ్డు మీదికి వొచ్చి తెడ
ఏదో చెప్పిపోతుంది
ఏటికీ వెన్నెలకు మధ్య
ఊదు పొగలా ఆకాశం
నీలి రాక కోసం
నిశ్శబ్దం నిచ్చెనగా పరుచుకుంది
ఈ నీటి ఒడ్డున నీకోసం
యుగాల నిరీక్షణ కదా నీలి
హోయలు హొయలుగా
గాలి, చెట్లు పెనవేసుకుంటున్నయ్
చెట్టుమీద పిట్టల కిచ కిచ ముచ్చట్లకు
వెన్నెల సిగ్గు పడుతుంది
అన్నీ నృత్యంలో ఉన్నాయి
అంతా వేడుకగా ఉంది
ఇక్కడే నా ఆత్మని గాలిపటంలా
ఎగిరేసుకుంటున్న
అంతరమంతా దీపాలు ముట్టించి ఉంటే
నీలి ఏకాంతమై వచ్చింది
నేను, నా కలలు నాటుకున్న లోకంలో ఉన్న
ఇక్కడ ఏ వాయిద్యమూ లేని సంగీతం వినిపిస్తుంది
– మనాసు వెంకట్