Reading Time: 2 minutes

షాపూర్జీ పల్లోంజీ వాటాలపై టాటా ట్రస్ట్ గురి.. నోయెల్ టాటా రూ.25వేల కోట్ల ఆఫర్!

Caption of Image.

టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు(SP Group) కీలకమైన ఆర్థిక ఉపశమనం కలిగించే కొత్త ఆఫర్ తెరపైకి తెచ్చారు. ఎస్పీ గ్రూప్ తన వద్ద ఉన్న టాటా సన్స్ వాటాలను కొంతవరకు అమ్మటం ద్వారా తగినంత లిక్విడిటీని సమకూర్చుకునేందుకు ఈ ప్లాన్ దోహదపడుతుందని సూచించారు. టాటా హోల్డింగ్ కంపెనీని పబ్లిక్ లిస్టింగ్ చేయడాన్ని ట్రస్ట్స్ గట్టిగా వ్యతిరేకిస్తున్న వేళ ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

రూ. 25వేల కోట్ల భారీ ఆఫర్..
సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో నోయెల్ టాటా ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రవేశపెట్టారు. ఎస్పీ గ్రూప్‌కు చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సైరస్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా టాటా సన్స్ వాటాలను విక్రయించాలని ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను నిబంధనల (1962 రూల్ 11యూఏ) ప్రకారం కనీస వాల్యుయేషన్ ఆధారంగా ఈ లావాదేవీ ద్వారా రూ.25వేల కోట్ల స్థూల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

రెండు విడతలుగా వాటాల కొనుగోలు..
ఈ షేర్ల కొనుగోలు ఆఫర్ ప్రక్రియను ఒకేసారి కాకుండా.. 18 నెలల కాలంలో రెండు విడతలుగా పూర్తి చేయాలని ప్లాన్ సిద్ధం చేశారు నోయెల్ టాటా. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా సెలెక్టివ్ క్యాపిటల్ రిడక్షన్ ప్రక్రియను టాటా సన్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రూల్స్ ప్రకారం ఫెయిర్ వాల్యూ పద్ధతిలో టాటా సన్స్ షేర్లకు విలువ కడతారు. ఈ నిధులను సమకూర్చుకునేందుకు అంతర్గత క్యాష్ మార్గాలు, లిస్టెడ్ పెట్టుబడుల అమ్మకం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని నోయెల్ టాటా బోర్డును కోరారు.

ALSO READ : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సేల్స్ షురూ

పబ్లిక్ లిస్టింగ్‌కు టాటా ట్రస్ట్స్ వ్యతిరేకత..
టాటా సన్స్ యాజమాన్య నిర్మాణం ప్రకారం.. టాటా ఛారిటబుల్ ట్రస్ట్స్ వద్ద దాదాపు 66% ఈక్విటీ వాటా ఉంది. ఎస్పీ ఫ్యామిలీ 18.37%, టాటా గ్రూప్ కంపెనీలకు 13% వాటాలు ఉండగా.. మిగిలినవి వ్యక్తుల వద్ద ఉన్నాయి. టాటా సన్స్‌ను పబ్లిక్ లిస్టింగ్ చేయాలనే అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ, టాటా ట్రస్ట్స్ మాత్రం దీనికి సుముఖంగా లేదు. దివంగత రతన్ టాటా మార్గదర్శకత్వంలో మార్చి 2024లో తీసుకున్న నిర్ణయం మేరకు టాటా సన్స్‌ను అన్‌లిస్టెడ్‌గానే ఉంచాలని నోయెల్ టాటా స్పష్టం చేశారు.

ఎస్పీ గ్రూప్‌కు న్యాయమైన పరిష్కారం..
ఎస్పీ గ్రూప్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఎలాంటి పబ్లిక్ లిస్టింగ్ అవసరం లేకుండానే ఈ రూ.25వేల కోట్ల లావాదేవీ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఎస్పీ గ్రూప్ ప్రయోజనాలను కాపాడుతూనే.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన, న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో భాగంగానే ఈ భారీ ఆఫర్ తీసుకొచ్చినట్లు ట్రస్ట్స్ పేర్కొన్నాయి. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు ఆపరేటింగ్ టీమ్‌లను రంగంలోకి దింపారు నోయెల్ టాటా.

©️ VIL Media Pvt Ltd.