
స్పై థ్రిల్లర్స్ అనగానే భారీ తారాగణం, హై-ఎండ్ గ్యాడ్జెట్స్, యాక్షన్ హంగులు గుర్తుకొస్తాయి. కానీ, అవేవీ లేకుండా ఒక భావోద్వేగమైన దేశభక్తికి, స్నేహానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కిన విభిన్న చిత్రమే ‘సీక్రెట్ సోల్జర్’. తొలుత ‘చైనా పీస్’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలై, తర్వాత ‘సీక్రెట్ సోల్జర్’గా పేరు మార్చుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈరోజు (18 సెప్టెంబర్ 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై డ్రామా ఎలాంటి థ్రిల్‌ను పంచిందో చూద్దాం.
సీక్రెట్ సోల్జర్ కథ:
నెల్లూరుకు చెందిన మీరా వలి (నిహాల్ కోదాటి), పృథ్వీ (సూర్య శ్రీనివాస్) ప్రాణ స్నేహితులు. పృథ్వీ డబ్బున్న కుర్రాడు కాగా, మీరా వలి దేశభక్తి నరనరానా జీర్ణించుకున్న యువకుడు. ఎప్పటికైనా ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది వలి కల. ఆ కలకు పృథ్వీ తనవంతు ప్రోత్సాహం అందిస్తుంటాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆర్మీలో చేరాలన్న వలి కల నెరవేరదు. తీవ్ర నిరాశలో ఉన్న వలికి, ఊహించని రీతిలో ఓ ఇంటెలిజెన్స్ మిషన్‌లో గూఢచారిగా (స్పై) పనిచేసే అవకాశం వస్తుంది. అసలు ఆ సీక్రెట్ మిషన్ ఏంటి? వలి ఒక గూఢచారిగా మారిన విషయం పృథ్వీకి ఎలా తెలిసింది? దేశం కోసం వలి చేసిన సాహసం ఏంటి? ఈ స్నేహితులిద్దరినీ వెంటాడిన ఆ అజ్ఞాత శత్రువులు ఎవరు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
ఇదొక రెగ్యులర్ స్పై డ్రామాలా కాకుండా, నెల్లూరు కుర్రాళ్ల స్నేహం, దేశభక్తి అనే రెండు సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్నేహితుల ప్రయాణంలా సాగుతుంది. భిన్న నేపథ్యాలు ఉన్న ఇద్దరి మధ్య స్నేహం, సహజమైన హాస్యం బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే, వలి కుటుంబ నేపథ్యం, ఆర్మీలో చేరడానికి చేసే ప్రయత్నాలకే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడంతో అసలు కథలోకి వెళ్లడానికి ప్రథమార్ధం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద వచ్చే కీలకమైన మలుపు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
సెకండ్ హాఫ్ లో గూఢచర్యం, అందులోని ఊహించని మలుపులు, స్నేహితులిద్దరూ ఆ మిషన్‌లో భాగమయ్యే తీరు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే, హీరో క్యారెక్టరైజేషన్‌లో దర్శకుడు తడబడ్డాడు. ఒక స్పైగా హీరో తన సొంత తెగువను, తెలివితేటలను చూపించడం కంటే, శత్రువుల చేతిలో ఒక పావులాగే ఎక్కువగా కనిపిస్తాడు. స్పై సినిమాల్లో ఉండాల్సిన సీరియస్‌నెస్ గానీ, ఆ గాఢత గానీ మిస్ అయ్యాయి. జాతీయ భద్రత లాంటి సున్నితమైన అంశాలను మరీ సినిమాటిక్‌గా చూపించడం కాస్త నిరాశపరుస్తుంది. కానీ, గూఢచారుల జీవితాలు ఎలా అజ్ఞాతంగా ముగిసిపోతాయి, వాళ్లకు దక్కే గుర్తింపు ఎంత శూన్యం అనే విషయాన్ని ముగింపులో చూపించిన తీరు మాత్రం గుండెను బరువెక్కిస్తుంది. ఒకరకంగా టైటిల్ జస్టిఫికేషన్ కూడా అదే. “కమర్షియల్ హంగులకు దూరంగా, దేశం కోసం అజ్ఞాతంగా ప్రాణాలర్పించే గూఢచారుల త్యాగాలకు నిలువుటద్దం ఈ ‘సీక్రెట్ సోల్జర్’.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే దేశభక్తి మెండుగా ఉన్న యువకుడు మీరా వలి పాత్రలో నిహాల్ కోదాటి ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటన మెప్పిస్తుంది. ఇక డబ్బున్న కుర్రాడిగా, నెల్లూరు యాసలో మాట్లాడుతూ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సూర్య శ్రీనివాస్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీయే సినిమాను నిలబెట్టింది. హర్షిత బండ్లమూరి, శిరీష నూలు కీలకమైన పాత్రల్లో ఆకట్టుకున్నారు. రఘుబాబు, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు లాంటి వారు ఉన్నప్పటికీ, దర్శకుడు వాళ్లను చిన్న పాత్రలకే పరిమితం చేసి వారి పూర్తి సామర్థ్యాన్ని వాడుకోలేకపోయాడు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే అక్కి విశ్వనాథ్ రెడ్డి ఒక అరుదైన, సున్నితమైన నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ, దానిని తెరపై నమ్మశక్యంగా ఆవిష్కరించడంలో అక్కడక్కడా తడబడ్డాడు. కథనం నెమ్మదించినా, ఆయన రాసుకున్న మాటలు మాత్రం ఆలోచింపజేస్తాయి. సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. కార్తీక్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలలోని ఎమోషన్‌ను ఎలివేట్ చేశాయి. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ బాగున్నా, ప్రథమార్ధంలో సినిమా నిడివిని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా పర్వాలేదనిపిస్తాయి.
ఫైనల్లీ సీక్రెట్ సోల్జర్ ఓ ఇంట్రెస్టింగ్ అటెంప్ట్.