Reading Time: < 1 minute
Mivi One 5g Smartphone Launch Price Features

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన మివీ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ‘Mivi One 5G’ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నెల 24న అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించబడే ఈ ఫోన్ ధర రూ. 15,000 లోపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లూ, గ్రీన్, పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభించనుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ పనితీరుపై వినియోగదారుల్లో భారీ అంచనాలున్నాయి.

డిజైన్ పరంగా.. ఫోన్ వెనుకభాగంలో వర్టికల్ పొజిషన్‌లో పిల్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఇవ్వగా.. పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ అమర్చారు. అయితే డిస్ప్లే, బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఫోన్ లాంచ్‌తో పాటు కస్టమర్లకు అందించే ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌పై మివీ ప్రత్యేక దృష్టి సారించింది. ‘మివీ కేర్+’ పేరుతో ఉచిత సర్వీస్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 500లకు పైగా సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రత్యేకంగా ‘Replaced, not repaired’ పాలసీని పరిచయం చేయడం ఈ ఫోన్ ప్రధాన విశేషం. దీని ప్రకారం ఫోన్ నచ్చకపోతే లేదా సమస్య వస్తే రిపేర్ చేయడం కుదరదు, నేరుగా 7 రోజుల్లోపు రీప్లేస్‌మెంట్ పొందవచ్చు. అలాగే 1 సంవత్సరం వారంటీ, సర్వీస్ రిక్వెస్ట్‌లను ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్, డోర్‌స్టెప్ పిక్‌అప్ అండ్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫీచర్లు మార్కెట్లో పోటీని పెంచే అవకాశం ఉంది.