
చేతి నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులను హస్తకళ అంటారు. ఈ హస్తకళల్లో ప్రధానంగా వెండి నగిషీ పనులు, అద్దంక పరిశ్రమ, బీదర్ చేనేత వస్త్రాలు, లేసులు అల్లికలు, బొమ్మలు ఆట వస్తువులు, కంచు ఇత్తడి రాగి వస్తువులు, పూసల పరిశ్రమ మొదలైనవి. భారతీయ హస్తకళల్లో తెలంగాణ చేతి వృత్తులకు విశిష్ట స్థానం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన హస్తకళల గురించి తెలుసుకుందాం.
వెండి నిగిషీ పనులు (సిల్వర్ ఫిలిగ్రీ)
లోహాలను తీగలుగా మార్చి వాటికి అద్భుతమైన రూపమివ్వడమే ఫిలిగ్రీ. 200 సంవత్సరాల క్రితం కరీంనగర్లోని ఎలగందుల ప్రాంతంలో ఆవిర్భవించింది. సిల్వర్ ఫిలిగ్రీ కళను కడార్ల రామయ్య ప్రవేశపెట్టారు. ఇది పురాతన కాలం నుంచి విశ్వబ్రాహ్మణులు అభ్యస్తిస్తున్న కళ. ఫిలిగ్రీ కళను స్థానికంగా జాలిగా వ్యవహరిస్తారు. కరీంనగర్ వెండి నిగిషీ పనులకు ప్రసిద్ధి. నగల పెట్టెలు, ఫ్లవర్వాజ్లు, చార్మినార్ బొమ్మలు, పక్షులు పుష్పాల ఆకృతులు మొదలైన వాటిపై అతి సున్నితమైన వెండి నిగిషీ పనులు ఇక్కడ చేస్తారు. సిల్వర్ ఫిలిగ్రీకి 2007లో భౌగోళిక గుర్తింపు లభించింది.
బిద్రి వస్తువులు
హైదరాబాద్ బిద్రి వస్తువులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. నైజాంలో భాగంగా ఉన్న బీదర్లో ఈ కళ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం పేరుమీదగానే ఈ కళకు ఆ పేరు వచ్చింది. సుల్తాన్ అమ్మద్ షా ఈ కళను పర్షియా నుంచి ఇండియాకు తీసుకువచ్చాడు. కాపర్, జింకుల మిశ్రమం(గన్మెటల్)తో చేసిన వస్తువపై మొదట నల్లని రంగు వేసి దానిపై సిల్వర్ లేదా బంగారు రంగులతో డిజైన్స్ వేస్తారు. సిగార్, హుక్కా బలున్స్, ఫ్లవర్వాజ్లు, నగల డబ్బాలు, అలంకరణ వస్తువుల తదితర ఎన్నో వస్తువులు వీరు తయారు చేస్తారు. బిద్రి కళ ఉత్తర భారతదేశంలోని ముర్షిదాబాద్, లక్నో, పుణె పట్టణాలకు విస్తరించింది.